ప్రియుడు సైబర్ నేరంలో చిక్కుకున్నాడు. అతనికి కాపాడేందుకు ఢిల్లీ నుంచి ప్రియురాలు హైదరాబాద్ వచ్చింది. ప్రియుడిని ఎలాగైనా జైలు నుంచి బయటకు రప్పించాలని ప్రయత్నించింది. కానీ ఆమె వేసిన దొంగ ప్లాన్ పోలీసులు పసిగట్టడంతో అడ్డంగా బుక్కైంది. చివరకు ఆమె కూడా జైలుపాలయ్యింది. ఈ సంఘటన నగరంలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సైబరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులు మార్చిలో ఓ మ్యాట్రిమోనియల్‌ మోసం కేసులో నైజీరియాకు చెందిన సైబర్‌ మోసగాడు గిడ్డె ఇసాక్‌ ఒలూను ఢిల్లీలో అరెస్టు చేశారు. అతడి ప్రియురాలు రోజ్‌లైన్‌ ఎన్నా ఇకురే.. 2016 ఫిబ్రవరిలో మెడికల్‌ వీసాపై ఢిల్లీ వచ్చింది.

అదే ఏడాది ఏప్రిల్‌లో ఆమె వీసా గడువు ముగిసినా.. అనధికారికంగా భారత్‌లో ఉంటోంది. ఆమె ఇసాక్‌ను కాపాడేందుకు హైదరాబాద్‌ వచ్చింది. బెయిల్‌ కోసం రెండు పూచీకత్తులు అవసరమైతే.. తాను ఈ ఏడాది మార్చి 15న భారత్‌కు వచ్చినట్లు నకిలీ వీసా, ఇతర పత్రాలను సృష్టించి, కూకట్‌పల్లి కోర్టుకు సమర్పించింది. 

మరో పూచీకత్తు విషయంలోనూ తప్పుడు పత్రాలను సమర్పించింది. ఆ పత్రాలను పోలీసుల పరిశీలనకు పంపగా.. సైబర్‌క్రైం పోలీసులు అవి నకిలీవని తేల్చారు. దీంతో కోర్టును, ప్రభుత్వాన్ని మోసగించిందనే అభియోగాలపై ఆమెను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.