హైదరాబాద్‌లో మహిళా కానిస్టేబుల్ హనీట్రాప్ వ్యవహారం బయటపడింది. డబ్బులున్న వారిని ట్రాప్ చేసి వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా ఆమెపై ఆరోపణలు వున్నాయి. ఇప్పటి వరకు ముగ్గురిని పెళ్లి చేసుకున్న ఏఆర్ కానిస్టేబుల్ సంధ్యా రాణి ఇద్దరికి విడాకులు ఇచ్చేసింది. ఒక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆ తర్వాత మరో యువకుడిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంది. అతను ఓ సెల్ఫీ వీడియోలో తన వేదనను పంచుకున్నాడు. షాబాద్ మండలం హైతబాద్‌కు చెందిన ఆ యువకుడు చరణ్ తేజను ట్రాప్ చేసింది సంధ్యా రాణి. ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌ వచ్చిన చరణ్ తేజ్‌ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంది.

 

 

పెళ్లి చేసుకోకపోతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని బెదిరించినట్లు బాధితుడు చెబుతున్నాడు. కానిస్టేబుల్ సంధ్యా రాణి నుంచి తనను రక్షించాల్సిందిగా శంషాబాద్ డీసీపీ, షాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తల్లిదండ్రులను కలవడానికి అనుమతించడం లేదని అతను చెప్పాడు. తనను మానసికంగా, శారీరకంగా హింసకు గురి చేస్తోందని అతను ఫిర్యాదు చేశాడు.

 

 

గత వివాహాలు విషయం బయటపడకుండా చరణ్‌ను పెళ్లి చేసుకుంది సంధ్య. ఒంటరిగా ఉన్న అబ్భాయిలను ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకుంటుందని బాధితుడు ఫిర్యాదులో పొందుపరిచాడు. సంధ్య రాణి బాధితులు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని చరణ్ కోరాడు. గతంలో సంధ్యా రాణి వరుస పెళ్లిళ్లపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఆమె తల్లిదండ్రులు స్వయంగా ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. 

 

 

పోలీస్ ఉద్యోగమన్న ధైర్యంతో భయపడకుండా ఇష్టం వచ్చిన వారితో తిరుగుతుందని ఆమె తల్లిదండ్రులు అంటున్నారు. సంధ్యారాణి ట్రాప్ చేసిన వారిని తన ఇంట్లో కాకుండా సెపరేట్ రూమ్ తీసుకొని వారితో గడుపుతున్నట్లుగా తెలుస్తోంది. సంధ్యా రాణని పోలీస్ శాఖ నుండి సస్పెండ్ చేసి ఆమె ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని చరణ్ డిమాండ్ చేశాడు,