Asianet News TeluguAsianet News Telugu

పెళ్లైన ఇద్దరి మధ్య ప్రేమ.. వివాహేతర సంబంధంగా మారి.. పెళ్లికి ఒప్పుకోరని ఆత్మహత్య..

పెళ్లైన ఇద్దరి మధ్య ఏర్పడిన ప్రేమ.. చివరికి వారి ప్రాణాలు బలితీసుకుంది. తమ వివాహానికి ఇరు కుటుంబాలు ఒప్పుకోవని.. పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. 

woman and man committed suicide over extra marital affair in khammam
Author
Hyderabad, First Published Aug 8, 2022, 2:02 PM IST

ఖమ్మం : వివాహితులైన ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అది వారిద్దరూ ఒకరినొకరు విడిచి ఉండలేని స్థితికి చేరుకుంది. అయితే, తమ పెళ్లికి, లేదా కలిసి ఉండడానికి ఇరు కుటుంబాలు, సమాజం అంగీకరించదని మనస్థాపంతో ఇద్దరూ పురుగుల మందు తాగి, బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన మండలంలోని వినోబా నగర్ లో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై పోటు గణేష్ తెలిపిన వివరాల ప్రకారం.. వినోబా నగర్ గ్రామానికి చెందిన తంబారపు ప్రసన్న జ్యోతి(25)కి అదే గ్రామానికి చెందిన కరుణాకర్ తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది.

వారికి నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. భర్తతో విభేదాల నేపథ్యంలో జ్యోతి రెండేళ్లుగా పుట్టింట్లోనే ఉంటుంది. ప్రస్తుతం పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం కోసం కొత్తగూడెంలో కోచింగ్ తీసుకుంటుంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన సిరికొండ ప్రశాంత్ (30) అనే ట్రాలీ, లారీ డ్రైవర్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. 

అయితే ఈ బంధం వారిని ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి తీసుకువచ్చింది. అలా ఉండాలంటే పెళ్లి ఒక్కటే మార్గం అనుకున్నారు. అయితే అప్పటికే పెళ్లిళ్లయి.. పిల్లలు, భార్య, భర్తలు కూడా ఉన్న తాము మళ్లీ పెళ్లి చేసుకుంటామంటే.. ఇరు కుటుంబాలూ ససేమిరా అంటాయి. తన భర్తకానీ, అతని భార్య కానీ దీనికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. ఒకవేళ అలా కాకుండా ఉండాలంటే తమ బంధం ఎప్పటికైనా బయటపడుతుంది.ఇలా పలురకాలుగా ఆలోచించారు. దీనికి తాము చనిపోవడం ఒక్కటే మార్గం అనుకున్నారు. 

సూర్యాపేటలో పరువు హత్య?.. వేరే కులం వ్యక్తి చెల్లిని ప్రేమిస్తున్నాడని అన్న దారుణం...

ఈనెల 4న ఉదయం ప్రసన్న జ్యోతి హాల్ టికెట్ తెచ్చుకుంటానని చెప్పి జూలూరుపాడు బయలుదేరింది. ఆమెతో పాటు ప్రశాంత కూడా వెళ్ళాడు. అయితే సాయంత్రం వరకు ఆమె తిరిగి రాకపోవడంతో ప్రసన్న జ్యోతి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా అదే రోజు ఇద్దరు పురుగుల మందు తాగి ఖమ్మంలోని లారీ అసోసియేషన్ కార్యాలయానికి వెళ్లారు. ఆఫీసులో వాంతులు చేసుకోవడంతో అక్కడ ఉన్నవారు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో వారిద్దరినీ చేర్పించి ఇరు కుటుంబాల వారికి సమాచారం అందించారు. 

కాగా, అక్కడ చికిత్స తీసుకుంటూ ప్రశాంత్ శనివారం రాత్రి చనిపోయాడు. ప్రసన్న జ్యోతి ఆదివారం ఉదయం మృతి చెందింది.  ప్రశాంత్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రసన్న జ్యోతికి  భర్త, కుమారుడు ఉన్నారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరి మృతితో వినోబా నగర్ లో విషాదం అలుముకుంది. రెండు కుటుంబాలు తీర్చలేని దు:ఖంలో మునిగిపోయాయి. చనిపోయే ముందు కనీసం కన్న పిల్లలైనా గుర్తుకు రాలేదా? అని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి తల్లి  తంబారపు లలిత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios