తెలంగాణలోనూ వైన్ షాప్స్ ఓపెన్, రేపటి నుంచే: ప్రభుత్వం పచ్చజెండా
తెలంగాణలో కూడా మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. రేపటి నుంచి తెలంగాణలో మద్యం అమ్మకాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అనుమతించింది. ఈ విషయంపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారు.
హైదరాబాద్: తెలంగాణలో రేపటి నుంచి వైన్ షాపులు తెరుస్తారు. మద్యం అమ్మకాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అదే సమయంలో మద్యం ధరలను పెంచనుంది. ఇతర రాష్ట్రాల్లో మద్యం షాపులను తెరిచిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా ఆడుగులు వేయాల్సి వచ్చింది.
ఈ నెలాఖరు వరకు, అంటే ఈ నెల 28వ తేదీ వరకు తెలంగాణలో లాక్ డౌన్ ను కొనసాగించే అవకాశం ఉంది. హైదరాబాదు, సూర్యాపేట, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదువుతున్నాయి. ఈ జిల్లాల్లో తగిన చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధపడుతోంది.
Also Read: తెలంగాణలో మే 28 వరకు లాక్ డౌన్ పొడిగింపు...?
కాసేపట్లో కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. అన్ని విషయాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి తగిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వలస కార్మికుల విషయంపై కూడా మంత్రివర్గంలో చర్చిస్తారు.
కేంద్ర ప్రభుత్వం జారీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏ విధమైన చర్యలను తీసుకోవాలనే విషయంపై కేసీఆర్ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుంది. వ్యవసాయ, భవననిర్మాణ రంగాలకు సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో మిగతా రంగాల పట్ల అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రివర్గంలో చర్చ జరగనుంది.