తెలంగాణలో మే 28 వరకు లాక్ డౌన్ పొడిగింపు...?
నిన్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశమైన కేసీఆర్ రాష్ట్రంలోని కరోనా వైరస్ తీవ్రతపై, వ్యాప్తిపై సమీక్ష నిర్వహించారు. వారితో కూలంకషంగా కరోనా వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉంది, తీసుకుంటున్న చర్యలు, ఎంతమేర కట్టడి చేయగలిగారు వంటి అనేక అంశాలను పరిశీలించారు.
నిన్న ఉదయం నుంచి అర్థరాత్రి వరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మారథాన్ సమీక్షలను నిర్వహించారు. వలస కూలీలను వెనక్కి పంపించడం నుంచి మొదలు, రాష్ట్రంలో కరోనా వ్యాప్తి వరకు ఇలా అన్ని విషయాలపై కూలంకషంగా అధికారులతో చర్చించారు.
తెలంగాణాలో రెండవదఫా విధించిన లాక్ డౌన్ కూడా ఎల్లుండితో ముగియనున్న విషయం తెల్సిందే! దేశంలో ఇప్పటికే మే 4 ముంచి మూడవ దఫా లాక్ డౌన్ భారీస్థాయి సడలింపులతో కొనసాగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణాలో మాత్రం రెండవదఫా లాక్ డౌనే ఇంకా కొనసాగుతుండడంతో అంతా కూడా మూడవదఫా లాక్ డౌన్ ఎలా ఉండబోతుందని ఆలోచిస్తున్నారు.
నిన్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశమైన కేసీఆర్ రాష్ట్రంలోని కరోనా వైరస్ తీవ్రతపై, వ్యాప్తిపై సమీక్ష నిర్వహించారు. వారితో కూలంకషంగా కరోనా వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉంది, తీసుకుంటున్న చర్యలు, ఎంతమేర కట్టడి చేయగలిగారు వంటి అనేక అంశాలను పరిశీలించారు.
ఈ చర్చల్లో అధికారులు జంటనగరాల పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉందని వారు విన్నవించారు. కేసులు ఈ ప్రాంతాల్లో అధికంగా నమోదవుతున్నందున... ఇక్కడ లాక్ డౌన్ లో ఎటువంటి సడలింపులు ఇవ్వకుండా,మరింత కఠినంగా అమలు చేయాలని నివేదించారు.
ఎంతమాత్రం కూడా అలసత్వం ప్రదర్శించొద్దని, ఒకవేళ గనుక ఎంతమాత్రం అజాగ్రత్తగా కానీ, ఉదాసీనంగా ఉన్నకాని వైరస్ విజృంభిస్తుందని వారు చెప్పినట్టు సమాచారం.
ఇక దానితోపాటుగా ప్రపంచవ్యాప్తంగా పాటిస్తున్న 70 రోజుల లాక్ డౌన్ మోడల్ ను పాటిస్తే ఎలా ఉంటుందని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలియవస్తుంది. అందుకోసమే మే 28 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తే ఎలా ఉంటుందని ఆయన ఆలోచిస్తున్నారు.
ఈ విషయమై నేడు జరిగే కేబినెట్ సమావేశంలో కేసీఆర్ అంతిమ నిర్ణయం తీసుకోనున్నారు. చూడాలి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో. కేంద్రం ఇచ్చిన సడలింపులు అమలు చేస్తారో లేదా రూటే సెపరేటు అన్నట్టుగా సడలింపులు లేకుండా 17 వరకు లాక్ డౌన్ పొడిగిస్తారా, లేదా ఊహాగానాలే నిజమయ్యేట్టు నెలాఖరువరకు లాక్ డౌన్ ను కొనసాగిస్తారా వేచి చూడాల్సిన అంశం.