Asianet News TeluguAsianet News Telugu

జనగామలో టీఆర్ఎస్‌ వర్సెస్ బీజేపీ.. మద్యం షాపుల మూసివేత.. టెన్షన్‌ వాతావరణం..

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ పాదయాత్ర కొద్దిసేపట్లో జనగామలోకి ప్రవేశించనుంది. అయితే బండి సంజయ్ పాదయాత్రను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకుంటారనే ప్రచారం నేపథ్యంలో టెన్షన్ నెలకొంది. 

Wine Shops Closed In Jangaon Ahead of bandi sanjay padayatra
Author
First Published Aug 18, 2022, 4:53 PM IST

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ పాదయాత్ర కొద్దిసేపట్లో జనగామలోకి ప్రవేశించనుంది. అయితే బండి సంజయ్ పాదయాత్రను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకుంటారనే ప్రచారం నేపథ్యంలో టెన్షన్ నెలకొంది. దీంతో ముందు జాగ్రత్తగా పోలీసులు భారీగా మోహరించారు. జనగామ పట్టణంలో మద్యం షాపులను తాత్కాలికంగా మూసివేయించారు. 5 బార్లు, 11 వైన్ షాపులకు తాళాలు వేయించారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోకుండా జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇటీవల దేవరుప్పులలో బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకున్న నేపథ్యంలో.. జనగామలో అలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

ఇక, జనగామలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఫ్లెక్సీ వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బండి సంజయ్ పాదయాత్ర జనగామలో ప్రవేశించనున్న నేపథ్యంలో.. ఆయనకు స్వాగతం పలుకుతూ బీజేపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే బీజేపీ ఏర్పాటు చేసిన కొన్ని ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చించివేసినట్టుగా చెబుతున్నారు.   టీఆర్ఎస్ నాయకులే ఈ పని చేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

మరోవైపు బండి సంజయ్‌‌కు సవాలు విసురుతూ టీఆర్ఎస్ కూడా ఫ్లెక్సీలు, హోర్డింగ్స్‌ ఏర్పాటు చేసింది. బండి సంజయ్ జనగామలో అడుగు పెట్టాలంటే.. నీతి ఆయోగ్ సిఫారసు చేసిన నిధులు తీసుకురావాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఫ్లెక్సీలు, హోర్డింగ్స్‌లో డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో అమలు అవుతన్న పథకాలు.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా? లేదా? అనేది బండి సంజయ్ ప్రకటించాలని అన్నారు. దీంతో జనగామలో నిన్నటి నుంచి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. 

ఈ క్రమంలోనే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై జనగామ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దశమంతరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బండి సంజయ్ కు సవాల్ విసిరే స్థాయి ముత్తిరెడ్డికి లేదని అన్నారు. దమ్ముంటే రా... జనగామ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద తేల్చుకుందామని ముత్తిరెడ్డికి సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి జనగామకు ముత్తిరెడ్డి తెచ్చిన నిధులపై చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు. ముత్తిరెడ్డికి నీతి ఆయోగ్ అంటే ఏమిటో నీకు తెలుసా? అని ఎద్దేవా చేశారు. హోర్డింగ్, ఫ్లెక్సీలతో జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios