ఏపీలో ఆ రెండు స్థానాల్లోటీఆర్ఎస్ పార్టీదే విజయమట 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసమే పుట్టిన పార్టీ.. ఆంధ్రా ఆధిపత్యంపై అడుగడుగున పోరాడిన పార్టీ ఇప్పుడు అదే ఆంధ్రా గడ్డపై కాలుమోపే ప్రయత్నిలు చేస్తుందా అంటే అవుననే చెప్పాలి.

ఎందుకంటే ఆ పార్టీకి చెందిన మంత్రే స్వయంగా ఆంధ్రాలో తమ పార్టీని విస్తరిస్తామని అక్కడ కూడా గెలిచితీరుమాని ఢంకా బచాయించి మరీ చెబుతున్నారు.

మరో వైపు ఆ పార్టీ అధినేత తనయుడు కూడా ఆంధ్రాప్రజలు తమ పాలనను, పార్టీని మెచ్చుకుంటున్నారని స్వయంగా ప్రకటించారు. ఇంతకీ ఆ పార్టీ ఏంటో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. అదే తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ.

మంత్రి జగదీశ్‌ రెడ్డి సూర్యాపేట జిల్లా కోదాడ పార్టీ కార్యాలయంలో ఆదివారం సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రాలోనూ తమ పార్టీని విస్తరిస్తామన్నట్లుగా చెప్పారు. పోటీచేస్తే ఆంధ్రాలోనూ టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని జోస్యం చెప్పారు.

సీఎం కేసీఆర్‌ పాలనను ఏపీ ప్రజలు ప్రశంసిస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే ఏపీలోని జగ్గయ్యపేట, నందిగామల్లో తమ పార్టీ గెలిచితీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక సీఎం తనయుడు మంత్రి కేటీఆర్ కూడా ఏపీలో తమ పాలనను ప్రజలు కొనియాడుతున్నారని తెలిపారు. ఇందుకు ఉదహరణగా తన ట్విటర్ లో ఓ ఏపీ పౌరుడు చేసిన పోస్టును ఉటంకించారు.

కేటీఆర్ ట్విటర్ లో ఓ ఏపీ వ్యక్తి .... ‘ కేటీఆర్ గారూ.. ఏపీ రాజకీయ నేతలతో విసుగెత్తిపోయం.. ప్రభుత్వ పాలన నచ్చడం లేదు.. టీఆర్‌ఎస్ పార్టీని తెలంగాణలోనే కాదు.. ఏపీలో కూడా విస్తరించండి.. ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నా‘మని ట్వీట్ చేశాడు.

దీనిపై వెంటనే స్పందించిన కేటీఆర్ .... బ్రదర్, మా రాష్ట్రంలోనే బోలెడన్ని పనులు ఉన్నాయి. వాటన్నింటిని నెరవేర్చాల్సిన బాధ్యత మాపై ఉందన్నారు. మా పాలనను గుర్తించినందుకు మీకు కృతజ్ఞతలు బ్రదర్ అని రిట్వీట్ చేశారు. 

ఈ పరిణామాలన్నీ గమనిస్తే ఏపీలో గులాబీ జెండా ఎగరవేయడానికి సమయం ఆస్నమైనట్లే కనిపిస్తోంది. అయినా తెలంగాణలో టీడీపీ ఉన్నప్పుడు ఆంధ్రాలో టీఆర్ఎస్ పార్టీ ఉంటే తప్పేముంది. చిత్తూరులో ఏఐడీఎంకే, అండమాన్ లో టీడీపీకి వేలాది మంది సభ్యులున్నప్పుడు ఆంధ్రాలే టీఆర్ఎస్ పార్టీలో ఓ వందమంది అయినా రాకుండా ఉంటారా...