హైదరాబాద్: తాను తన భర్తతోనే కలిసి ఉంటానని రిటైర్డ్  జడ్జి నూతి రామ్మోహన్ రావు కోడలు  సింధు శర్మ ప్రకటించారు.నూతి రామ్మోహన్ రావు కొడుకు వశిష్టతో పాటు ఆయన కుటుంబసభ్యులు తనపై దాడి చేస్తున్న దృశ్యాలను మూడు రోజుల క్రితం ఆమె బయటపెట్టింది.  

ఇదిలా ఉంటే తన భార్య నుండి తనకు విడాకులు ఇవ్వాలని  నూతి వశిష్ట కోర్టులో పిటిషన్ వేశాడు. అదే సమయంలో తన పిల్లలను  కూడ తన వద్దే ఉంచుకొంటానని ఆయన ఆ పిటిషన్ లో కోరాడు.

ఈ విషయమై వశిష్ట భార్య సింధు శర్మ స్పందించారు. తన పిల్లలను తండ్రి లేకుండా పెంచాలని కోరుకోవడం లేదని ఆమె చెప్పారు.తనపై  దాడికి సంబంధించిన దృశ్యాలను  బయటిపెట్టిన తర్వాత తన భర్త నుండి విడాకుల నోటీసును అందుకొన్నట్టుగా ఆమె చెప్పారు.

ఈ ఏడాది ఏప్రిల్ 20వ తేదీన  సింధు శర్మ ఓ సీసీటీవీ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్ గా  మారింది.

అత్తారింటిలో సింధు శర్మపై దాడికి సంబంధించిన దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఈ విషయమై ఈ ఏడాది ఏప్రిల్ 26న రిటైర్డ్ జడ్జి నూతి రామ్మోహన్ రావు తో పాటు ఆయన భార్య దుర్గ జయలక్ష్మి, సింధు శర్మ భర్త వశిష్ట లపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.

498 ఎ. 323, 406 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసు నమోదైన రోజునే తనపై దాడి జరగడంతో ఆమె ఆసుపత్రిలో చేరారు.తన ఇంట్లోనే తన పిల్లలను ఇంట్లో దాచారన్నారు. తన పెద్ద కూతురును తనకు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో  పిటిషన్ దాఖలు చేసినట్టుగా ఆమె గుర్తు చేశారు.

సింధు శర్మ ఆరోపణలను నూతి రామ్మోహన్ రావు కుటుంబసభ్యులు తీవ్రంగా ఖండించారు.సింధు శర్మ విడుదల చేసిన వీడియోలు కల్పితమన్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే ఈ వీడియోలను సింధు శర్మ విడుల చేసిందని నూతి రామ్మోహన్ కుటుంసభ్యులు ఆరోపించారు.