సిపిఐకి కేవలం 3 సీట్లు ఇస్తామని కాంగ్రెసు మొండికేసింది. అయితే, టీజీఎస్ డీల్ తమకు ఇవ్వాలని సిపిఐ పట్టుబడుతోంది. టీజెఎస్ కాంగ్రెసు ఇవ్వజూపుతున్న సీట్ల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉంది.

హైదరాబాద్: సీట్ల సర్దుబాటుపై తెలంగాణ జన సమితి (టిజెఎస్) అధ్యక్షుడు కోదండరామ్ ఓవైపు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న తరుణంలోనే సిపిఐ అల్టిమేటమ్ జారీ చేసింది. సీట్ల సర్దుబాటు విషయంలో జాప్యం చేస్తే తాము ప్రజా కూటమి నుంచి తప్పుకుంటారమని హెచ్చరించింది. 

సిపిఐకి కేవలం 3 సీట్లు ఇస్తామని కాంగ్రెసు మొండికేసింది. అయితే, టీజీఎస్ డీల్ తమకు ఇవ్వాలని సిపిఐ పట్టుబడుతోంది. కోదండరామ్ ఎన్నికల్లో పోటీ చేయకూడదని, ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆయనకు డిప్యూటీ సిఎం పోస్టు ఇస్తామని, శాసన మండలికి ఆయనను ఎంపిక చేస్తామని కాంగ్రెసు నాయకత్వం చెబుతోంది. 

అయితే, టీజెఎస్ కాంగ్రెసు ఇవ్వజూపుతున్న సీట్ల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ స్థితిలో సీట్ల సర్దుబాటుపై చర్చించే బాధ్యతను కాంగ్రెసు నాయకత్వం సీనియర్ నేత జానారెడ్డికి అప్పగించింది. 

కాగా, సిపిఐ 9 సీట్లు డిమాండ్ చేస్తోంది. ఈ స్థితిలో కనీసం తమకు ఐదు సీట్లయినా ఇస్తారనే ఆశతో ఉంది. అయితే, కాంగ్రెసు అందుకు సిద్ధంగా లేదు. దీంతో ప్రజూకూటమితో తెగదెంపులు చేసుకోవాలని కూనమనేని సాంబశివరావు, ఇతర నాయకులు కొంత మంది సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డికి సూచించారు. 

ప్రజా ప్రయోజనాల కోసం టీఆర్ఎస్ ను ఓడించేందుకు తాము ఇతర పార్టీలతో చేతులు కలుపుతున్నామని సురవరం సుధాకర్ రెడ్డి అంటున్నారు. సీపిఐకి తగినన్ని సీట్లు ఇవ్వకపోతే సురవరం సుధాకర్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగే అవకాశాలున్నాయి. 

తాజా పరిణామాల నేపథ్యంలో ప్రజా కూటమిలో సీట్ల సర్దుబాటులో, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక ప్రకటనల్లో జాప్యం జరిగే అవకాశాలున్నాయి.