కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ప్రముఖ ఎన్నికల వ్యుహాకర్త ప్రశాంత్ కిషోర్ శనివారం భేటీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన కాంగ్రెస్‌లో చేరతారా..? లేక వ్యుహాకర్తగా మాత్రమే సేవలందిస్తారా..? అనే చర్చ జోరుగా సాగుతుంది.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ప్రముఖ ఎన్నికల వ్యుహాకర్త ప్రశాంత్ కిషోర్ శనివారం భేటీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలోని 10 జన్‌పథ్‌లో జరిగిన ఈ సమావేశంలో ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో పాటు 10 మంది వరకు సీనియర్ నేతలు హాజరైనట్టుగా తెలుస్తోంది. నాలుగు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో.. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుల ముందు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. 2024 లోక్‌సభ ఎన్నికలు, త్వరలో జరగనున్న కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం రోడ్‌మ్యాప్‌పై ప్రజెంటేషన్ ఇచ్చినట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
ఇక, గతేడాది కూడా ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ ముఖ్యులతో సమావేశమైన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని ప్రశాంత్ కిషోర్ భావిస్తున్నారు. ఈ విషయంలో తనకు పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగించాలని సోనియా గాంధీ కుటుంబాన్ని గత కొంత కాలంగా కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రక్షాళన అనేది కత్తిసాము లాంటిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నాయి. ఇక, వ్యుహాకర్తగా, సలహాదారుడిగా కాకుండా ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
నేడు (ఏప్రిల్ 16) మరోసారి సోనియా గాంధీతో పీకే భేటీ కావడంతో.. ఆయన కాంగ్రెస్‌లో చేరతారా..? లేక వ్యుహాకర్తగా మాత్రమే సేవలందిస్తారా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ సాగుతుంది. పీకే కాంగ్రెస్‌లో చేరి.. పార్టీ కోసం వ్యుహాలు రచిస్తారనే ప్రచారం కూడా సాగుతుంది. అయితే కాంగ్రెస్ అధిష్టాన వర్గాల సమాచారం.. కాంగ్రెస్‌లో ప్రశాంత్ కిషోర్ పోషించే భూమిక ఏమిటనేది వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఓ వర్గంలో మాత్రం పీకే కాంగ్రెస్‌లో చేరడం ఖాయమనే ప్రచారం సాగుతోంది.
అయితే దేశంలో ప్రస్తుతం బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల కూటమికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ దిశలో ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ లేకుండానే ప్రతిపక్షాలు ఏకం కావాలని మమతా భావిస్తున్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ కూడా జాతీయ స్థాయిలో ప్రతిపక్ష కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దేశంలో కాంగ్రెస్ లేకుండా బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు అనేది అసాధ్యమని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పలుమార్లు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఎన్నికల వ్యుహాకర్తగా ఉన్న పీకే పలు రాష్ట్రాల్లో వివిధ పార్టీల కోసం పనిచేస్తున్నారు. బెంగాల్‌లో మమతా విజయం కోసం పీకే వ్యుహాలు రచించారు. ఏపీలో వైసీపీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక భూమిక పోషించారు. ఇప్పుడు తెలంగాణలో టీఆర్‌ఎస్ కోసం సర్వేలు చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా వెల్లడించారు. అయితే ఈ మూడు రాష్ట్రాల విషయం చూస్తే బెంగాల్‌లో దీదీ వర్సెస్ కాంగ్రెస్, తెలంగాణలో కేసీఆర్ వర్సెస్ కాంగ్రెస్ పరిణామాలు ఉండగా.. ఏపీలో సీఎం జగన్ కాంగ్రెస్ వల్లే తాను కేసులు ఎదుర్కొంటున్నానని చెబుతారు. అయితే పీకే ఇప్పుడు యాక్టివ్‌గా పనిచేస్తున్నది టీఆర్‌ఎస్‌కు మాత్రమే అని చెప్పాలి.
ఇక, తెలంగాణలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే తాము పీకేతో కలిసి పనిచేస్తున్నట్టుగా సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలని చూస్తున్న కేసీఆర్.. తన ప్రయత్నాల్లో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషిస్తారని కూడా చెప్పారు. పీకేతో తనకు ఎనిమిదేళ్ల పరిచయం ఉందని.. ఆయనకు క్షేత్ర స్థాయిలో కచ్చితమైన సర్వేలు చేయడంలో మంచి నైపుణ్యం ఉందని, డబ్బు కోసం పనిచేసే వ్యక్తి కాదని ప్రశంసలు కురిపించారు.
హుజురాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి, జీహెచ్‌ఎంసీ బీజేపీ నుంచి గట్టి పోటీ నేపథ్యంలో.. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జాగ్రత్తగా ముందుకెళ్లి విజయం సాధించాలని కేసీఆర్ చూస్తున్నారు. ఈ క్రమంలోనే పీకేతో.. పలు అంశాలపై సర్వేలు చేయించుకుంటున్నారు. ఓవైపు రాష్ట్రంలో విస్తరించాలని చూస్తున్న ప్రతిపక్షాలను ఎదుర్కొవడంతో పాటుగా.. జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించాలనే తన కళను నేరవేర్చుకోవడానికి గులాబీ బాస్ పీకే సేవలను ఉపయోగించుకుంటున్నారు. కొంతకాలంగా జాతీయ రాజకీయాలకు సంబంధించి కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు, రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్‌తో సన్నిహిత సంబంధాలు.. వీటన్నింటి వెనకాల పీకే మాస్టర్ మైండ్ ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది.
పీకే కాంగ్రెస్‌లో చేరితే టీఆర్‌ఎస్‌కు పనిచేస్తారా..?
ఒకవేళ పీకే కాంగ్రెస్ కోసం పనిచేసినా లేదా ఆ పార్టీలో చేరినా.. మరి తెలంగాణలో టీఆర్‌ఎస్ కోసం పనిచేస్తారా..? అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జాతీయ స్థాయిలో ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యుహాకర్తగా వ్యవహరించినప్పటికీ.. ఆయన తెలంగాణలో టీఆర్‌ఎస్ కోసం పనిచేసే అవకాశాలు ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పీకే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కోసం పనిచేసినప్పుడు.. రాష్ట్రాల్లో ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం ఒకరకంగా గ్రాండ్ ఓల్డ్ పార్టీకి ఇబ్బంది కలిగించే అంశమని చెబుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఇలాంటి వాటికి అంగీకరించకపోవచ్చని అంటున్నారు. ఈ పరిణామాలు వాస్తవ రూపం దాల్చితే జాతీయ స్థాయిలో పీకే సేవలు వినియోగించుకోవాలని చూస్తున్న గులాబీ బాస్‌కు ఎదురుదెబ్బ తగిలే చాన్స్ ఉందంటున్నారు.
ఇక, పీకే కాంగ్రెస్‌లో చేరితే మాత్రం.. పూర్తిగా ఇతర పార్టీలో ఆయన సేవలు అందించకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇలా జరిగిన పక్షంలో మరి కేసీఆర్, పీకేల మధ్య ఉన్న అవగాహన మాటేమిటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఒకవేళ పీకే కాంగ్రెస్‌లో చేరిన పక్షంలో.. ఆయన పార్టీలో కీలకంగా వ్యవహరించే అవకాశం ఉందని.. ఇతర పార్టీలకు పనిచేసే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పక్షంలో పీకే.. కేసీఆర్ అవగాహనకు బ్రేక్ చెప్పే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే తన టీమ్ చేస్తున్న సర్వేలను మాత్రం కేసీఆర్‌కు సమర్పించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక, ఏ విధంగానైనా(పార్టీలో చేరడం లేదా వ్యుహాకర్తగా) కాంగ్రెస్‌కు పనిచేయాలని పీకే ఫిక్స్ అయితే మాత్రం.. జాతీయ స్థాయిలో కీలకంగా వ్యవహరించాలని చూస్తున్న కేసీఆర్‌కు ఆయన మద్దతు ఉండదనేది మాత్రం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మరోవైపు ప్రస్తుతం సునీల్ తెలంగాణ, కర్ణాటక బాధ్యతలు చూస్తున్నారని రాహుల్ గాంధీ.. పార్టీ నాయకుల సమావేశాల్లో ప్రకటించారు. ఒకవేళ ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరితే.. ఎలా ఉపయోగించుకుంటారనేది అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. కేవలం లోక్‌సభ ఎన్నికలతో పాటు, ఇతర అసెంబ్లీ ఎన్నికలకు పరిమితం.. లేకుంటే మొత్తం బాధ్యతలు అప్పగిస్తారా అనేది కాంగ్రెస్ అధిష్టానమే నిర్ణయించాల్సి ఉంటుంది.
అయితే కాంగ్రెస్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం, ప్రచారంలో ఉన్న వార్తలను విశ్లేషిస్తే మాత్రం.. ప్రశాంత్ కిషోర్ తొలుత.. కర్ణాటక, తెలంగాణలలో పార్టీ కోసం పనిచేయనున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ కర్ణాటకలో బలమైన ప్రతిపక్షంగా ఉంది. తెలంగాణ విషయానికి వస్తే.. ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో రాణించకపోయినా.. పార్టీ సంస్థాగతంగా బలంగా ఉంది. ఈ రెండు రాష్ట్రాలపై ఫోకస్ చేస్తే.. విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.
