బీజేపీ అధిష్టానం తనమీద విధించిన సస్పెన్షన్ ఎత్తేయకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటాను కానీ.. స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి దిగనని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.
హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే విషయం గురించి క్లారిటీ ఇచ్చారు. తనపై విధించిన సస్పెన్షన్ను బిజెపి అధిష్టానం తొలగించాలని ఆశిస్తున్నట్టుగా తెలిపారు. ఎన్నికల సమయం వరకు అధిష్టానం సస్పెన్షన్ను తొలగిస్తుందన్న నమ్మకం ఉందని రాజాసింగ్ అన్నారు. ఒకవేళ తన మీద విధించిన సస్పెన్షన్ తొలగించకపోతే.. వచ్చే ఎన్నికల్లో తాను పోటీకి దూరంగా ఉంటానని చెప్పుకొచ్చారు. అంతేకానీ, బిజెపికి నుంచి కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని చెప్పుకొచ్చారు.
ఈ మేరకు మంగళవారం రాజాసింగ్ పలు వార్తా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ విషయాలు చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా లంటే తనకు చాలా ఇష్టం అని, వారికి తాను పెద్ద అభిమానిని అన్నారు. బిజెపి పార్టీకి వ్యతిరేకంగా వెళ్లే ఉద్దేశం తనకు లేదని స్పష్టంగా చెప్పారు. కేంద్ర నాయకులే కాదు రాష్ట్రంలోని బిజెపి అగ్ర నేతలైన కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్ సహా అందరి ఆశీస్సులు తన మీద ఉన్నాయని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈమధ్య బుల్లెట్ బండి మీద తిరుగుతున్న సంగతి తెలిసిందే. తన బుల్లెట్ ప్రూఫ్ కారు పదేపదే మొరాయిస్తున్నా.. తెలంగాణ ప్రభుత్వం దాన్ని మార్చడం లేదని నిరసనగా.. కొద్ది కాలం క్రితం వాహనాన్ని ప్రగతిభవన్ గేటు ఎదుట వదిలేసి వచ్చారు. ఆ సమయంలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు తన బుల్లెట్ బండి మీద వచ్చి.. వినూత్న రీతిలో నిరసన తెలిపి.. అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం రాజాసింగ్ కు తెలంగాణ ప్రభుత్వం మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది.
తన బులెట్ ప్రూఫ్ వాహనం చాలాసార్లు ఆగిపోతుందని.. రిపేర్లకు వస్తుందని రాజాసింగ్ ముఖ్యమంత్రి కేసీఆర్, డిజిపి,హోమ్ మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆయన చివరికి తన వాహనాన్ని వదిలేశారు. సోమవారం రాజా సింగ్ కి వేరే బుల్లెట్ వాహనాన్ని ప్రభుత్వం సమకూర్చింది. ఈ వాహనం 2017 మోడల్ ది కావడం గమనార్హం. దీని మీద రాజా సింగ్ స్పందించారు.
‘తెలుపు రంగు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని దూల్పేట్ లోని మా ఇంటి దగ్గర వదిలి వెళ్ళినట్లు తెలిసింది. నేను శ్రీశైలం నుంచి హైదరాబాద్ కు ఇప్పుడే బయలుదేరాను. నేరుగా ఇంటికి వెళతాను. వెళ్లిన తర్వాత ఆ వాహనం కండిషన్ ఎలా ఉందో ఒకసారి పరీక్షిస్తాను. నాకు కొత్త బండి కావాలనే పట్టుదల ఏమీ లేదు. వాహనం మంచి కండిషన్లో ఉంటే చాలు’ అని అన్నారు.
కాగా, ఫిబ్రవరి 11న బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వీడి.. బుల్లెట్ బండి ఎక్కి వినూత్న రీతిలో నిరసనకు తెర లేపారు. బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం పలుమార్లు సతాయిస్తుందంటూ.. నడవనంటూ మొండికేస్తుందని.. చాలా సార్లు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వాహనం రోడ్డు మీద మూడుసార్లు ఆగిపోయింది. ఈ క్రమంలోనే తనకు కేటాయించిన బులెట్ ప్రూఫ్ వాహనాన్ని మార్చాలని రాజాసింగ్ గతంలోనే ప్రభుత్వాన్ని కోరారు. అయినా ఫలితం లేకుండా పోయింది.
