రాజాసింగ్ కు 2017 మోడల్ బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం.. ఇంటిదగ్గర పెట్టివెళ్లిన అధికారులు.. ఎమ్మెల్యే ఎమన్నారంటే..
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బుల్లెట్ బండిని తెలంగాణ ప్రభుత్వం మార్చేసింది. వేరు వాహనాన్ని సోమవారం ఆయన ఇంటిదగ్గర పెట్టివెళ్లారు అధికారులు.
హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈమధ్య బుల్లెట్ బండి మీద తిరుగుతున్న సంగతి తెలిసిందే. తన బుల్లెట్ ప్రూఫ్ కారు పదేపదే మొరాయిస్తున్నా.. తెలంగాణ ప్రభుత్వం దాన్ని మార్చడం లేదని నిరసనగా.. కొద్ది కాలం క్రితం వాహనాన్ని ప్రగతిభవన్ గేటు ఎదుట వదిలేసి వచ్చారు. ఆ సమయంలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు తన బుల్లెట్ బండి మీద వచ్చి.. వినూత్న రీతిలో నిరసన తెలిపి.. అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం రాజాసింగ్ కు తెలంగాణ ప్రభుత్వం మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది.
తన బులెట్ ప్రూఫ్ వాహనం చాలాసార్లు ఆగిపోతుందని.. రిపేర్లకు వస్తుందని రాజాసింగ్ ముఖ్యమంత్రి కేసీఆర్, డిజిపి,హోమ్ మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆయన చివరికి తన వాహనాన్ని వదిలేశారు. సోమవారం రాజా సింగ్ కి వేరే బుల్లెట్ వాహనాన్ని ప్రభుత్వం సమకూర్చింది. ఈ వాహనం 2017 మోడల్ ది కావడం గమనార్హం. దీని మీద రాజా సింగ్ స్పందించారు.
‘తెలుపు రంగు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని దూల్పేట్ లోని మా ఇంటి దగ్గర వదిలి వెళ్ళినట్లు తెలిసింది. నేను శ్రీశైలం నుంచి హైదరాబాద్ కు ఇప్పుడే బయలుదేరాను. నేరుగా ఇంటికి వెళతాను. వెళ్లిన తర్వాత ఆ వాహనం కండిషన్ ఎలా ఉందో ఒకసారి పరీక్షిస్తాను. నాకు కొత్త బండి కావాలనే పట్టుదల ఏమీ లేదు. వాహనం మంచి కండిషన్లో ఉంటే చాలు’ అని అన్నారు.
రాజాసింగ్కు మరోసారి బెదిరింపులు: పోలీసులపై ఎమ్మెల్యే ఫైర్
ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 11న బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈసారి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వీడి.. బుల్లెట్ బండి ఎక్కి వినూత్న రీతిలో నిరసనకు తెర లేపారు. బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం పలుమార్లు సతాయిస్తుందంటూ.. నడవనంటూ మొండికేస్తుందని.. రాజాసించాలా సార్లు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వాహనం రోడ్డు మీద మూడుసార్లు ఆగిపోయింది. ఈ క్రమంలోనే తనకు కేటాయించిన బులెట్ ప్రూఫ్ వాహనాన్ని మార్చాలని రాజాసింగ్ గతంలోనే ప్రభుత్వాన్ని కోరారు. అయినా ఫలితం లేకుండా పోయింది.
ఈ నేపథ్యంలో రాజాసింగ్ వినూత్న రీతిలో నిరసనకు తేరలేపారు. అంతకుముందురోజు ప్రభుత్వం తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ప్రగతి భవన్ గేటు వద్ద వదిలేసి వచ్చారు. దీంతో పోలీసులు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత దాన్ని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీకి ఎమ్మెల్యే రాజాసింగ్ తన బుల్లెట్ బండి మీద వచ్చారు. బుల్లెట్ బండి మీద వచ్చిన రాజాసింగ్ ను అక్కడి పోలీసులు గేట్ నెంబర్ 2 నుంచి లోపలికి వదిలారు.
అంతకు ముందురోజు.. ఫిబ్రవరి 10న బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ తనకి ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో ప్రగతి భవన్ కు వెళ్లారు. ఆ వాహనం పదేపదే చెడిపోతుందని, రోడ్డు మధ్యలో ఆగిపోతుందని తెలిపారు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవడం లేదని తన బాధ పట్టించుకోవడంలేదని అన్నారు. అందుకే నేరుగా సీఎంను కలిసి తన బాధను వెళ్లగక్కాలని తన వాహనాన్ని మార్చాలని అడగడానికి వచ్చినట్లుగా తెలిపారు. అయితే పోలీసులు ప్రగతి భవన్ దగ్గర రాజా సింగ్ ని అడ్డుకున్నారు.
దీంతో ఆయన తన వెంట తీసుకొచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ప్రగతి పవన్ దగ్గరే వదిలేసి వెనక్కి వెళ్ళిపోయారు. ఈ క్రమంలోనే పోలీసులు రాజా సింగను అరెస్ట్ చేశారు. అంతకంటే ముందు అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత రాజాసింగ్ తన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యంలో కారుటైరు ఊడిపోయింది. ఇలాగే గతంలో కూడా చాలాసార్లు బుల్లెట్ ప్రూఫ్ కారు సతాయించింది. తన కారును మార్చమని ప్రభుత్వానికి చాలాసార్లు లేఖలు రాశారని… కానీ కారు మార్చడానికి బదులు రిపేర్లు చేసి పంపిస్తున్నారని రాజాసింగ్ వాపోయారు.