బెస్ట్ ఫ్రెండ్, చంద్రబాబునూ కలుస్తా: స్టాలిన్ తో భేటీ తర్వాత కేసిఆర్

Will meet Chandrababu also : KCR after meeting with stalin
Highlights

జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెన్నైలో ఆదివారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

చెన్నై: జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెస్తానంటూ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెన్నైలో ఆదివారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన ప్రయత్నాల్లో భాగంగా తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కూడా కలుస్తానని చెప్పారు.

చంద్రబాబును కలుస్తారా అని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ తాము మంచి స్నేహితులమని, అందులో సందేహం అవసరం లేదని సమాధానమిచ్చారు. ఆదివారం చెన్నై చేరుకున్న కేసీఆర్ కు స్టాలిన్ స్వాగతం చెప్పారు. డిఎంకె అధినేత కరుణానిధిని కలిసిన తర్వాత ఆయన స్టాలిన్ తో భేటీ అయ్యారు.

స్టాలిన్ తో కలిసి ఆయన మధ్యాహ్న భోజనం చేశారు. కేసీఆర్ కోసం ప్రత్యేకంగా తమిళ వంటకాలను వడ్డించారు. భేటీ తర్వాత స్టాలిన్ తో కలిసి ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాను, చంద్రబాబు చాలా కాలం కలిసి పనిచేశామని చెప్పారు. అన్ని విషయాలపై చర్చలు జరుపుతానని, చర్చలు కొనసాగుతాయని అన్నారు. 

డిఎంకెతో మొదటి యుపిఎ ప్రభుత్వంలో కలిసి పనిచేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రాలకు కేంద్రం మరిన్ని అధికారులు ఇవ్వాలని అన్నారు. తెలంగాణలో మే 10వ తేదీన  రైతు బంధు పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్టాలిన్ ను ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. 

రాజకీయాల్లో మార్పు ఆవశ్యకతపై తృణమూల్ కాంగ్రెసు అధినేత మమతా బెనర్జీతో చర్చించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కేంద్రానికి సంబంధం లేని అంశాలను రాష్ట్రాలకు బదలాయించాలని ఆయన అన్నారు. 

జపాన్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో చూస్తున్నామని, తాను చాలా కాలం తర్వాత చెన్నై వచ్చానని, తనకు కరుణానిధి పుస్తకాలు బహూకరించారని చెప్పారు. విద్య, వైద్యం, సాగునీరు, మంచినీరు వంటి పలు సమస్యలను కేంద్ర ప్రభుత్వాలు పరిష్కరించలేకపోయాయని ఆయన విమర్శించారు. 

ప్రస్తుత పరిస్థితులు దేశాభివృద్ధికి సహకరించేలా లేవని అన్నారు. ఇందుకు దక్షిణాది రాష్ట్రాలు కలిసి రావాలని అన్నారు. తాము చాలా అద్భుతమైన పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం పోవాలని అన్నారు. 

తాము ఎవరితో కలిసి పనిచేస్తాం, చేస్తున్నామనేది భవిష్యత్తు నిర్ణయిస్తుందని అన్నారు. తాము ఎప్పుడు కూడా ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని చెప్పలేదని అన్నారు. మీడియా మాత్రమే ప్రసారం చేసిందని అన్నారు. 

loader