ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంతో నాయకులకు పదవలొచ్చాయి. ఓయూ విద్యార్థులకు మాత్రం ఇక్కట్లే మిగిలాయి. అందుకే వారి పోరాటం నవ తెలంగాణలోనూ కొనసాగుతూనే ఉంది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ తొక్కని గడపలేదు. ఎక్కని మెట్టు లేదు. కలవని రాజకీయనాయకుడు లేడు.
అమరుల త్యాగాలు, విద్యార్థుల పోరాటాలు, నాయకుల ఎత్తుగడలతో అనుకున్న విధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది.
ఈ ప్రత్యేక పోరులో ఓయూ విద్యార్థుల పోరాటం వెలకట్టలేనిది. ఉద్యమ కేంద్రంగా ఈ విద్యాలయం ఎన్నో ఏళ్లుగా రగిలిపోయింది. ప్రత్యేక పోరాటంలో రణభూమిగా మారిపోయింది. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు ఇక్కడికొచ్చి ఘోర పరాభవం మూటగట్టుకున్నారు. చావుతప్పికన్నులొట్టపోయే పరిస్థితిని తెచ్చుకున్నారు.
అందుకే ఉద్యమాల పురిటిగడ్డగా ఉన్న ఓయూకి వెళ్లాలంటే ప్రతి నాయకుడికి కాస్త భయమే. ఎక్కడ తమ పనితీరును ప్రశ్నిస్తారేమోనని.. ఎదురుదాడికి దిగుతారేమెనని...
ప్రత్యేక రాష్ట్రం వచ్చినా ఆ పరిస్థితి ఇంకా అక్కడ కొనసాగుతూనే ఉంది. దీనికి కారణం కూడా లేకపోలేదు.
ఉద్యాగాల కోసమే ప్రధానంగా పోరాడిన యువత కేంద్రస్థానం ఇది. మూడేళ్లు కావొస్తున్నా ఉద్యోగాల కల్పనలో తెలంగాణ సర్కారు దారుణంగా విఫలమైంది. అందుకే ఓయూ విద్యార్థులు ఈ విషయంలో టీఆర్ఎస్ పై రగిలిపోతూనే ఉన్నారు.
వందేళ్ల ఓయూ ఉత్సవాలను ఘనంగా చేసేందుకు ప్రభుత్వం సంకల్పిస్తున్న తరుణంలో నాయకులకు యువత నిరసన సెగ ఇప్పుడే తగులుతోంది.
నిన్న ఓయూకు వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఎంపీ కేకే(కే కేశవరావు)కు ఓయూ విద్యార్థులు చుక్కలు చూపించారు.
కేకే గెటవుట్ అంటూ నినాదాలు చేశారు. దీంతో కాస్తంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆయన కూడా ఒకప్పుడు ఓయూలోనే చదువుకున్నారు. ఆ అనుబంధంతోనే పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనేందుకు ఓయూకు వచ్చారు. అయితే విద్యార్థులు మాత్రం ప్రభుత్వంపై ఉన్న తమ ఆగ్రహాన్ని ఆయనపై వ్యక్తం చేశారు.
తెలంగాణ వచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు ఉద్యోగాలు భర్తీ ప్రక్రియ చేపట్టలేదని, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని, ఇచ్చిన నోటిఫికేషన్ కూడా వెనుకకు తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.
పాపం.. పదవి తప్ప అధికారం లేని కేకే పైనే ఇంతగా కేకేలేసిన ఉస్మానియన్ లు ఇక కేసీఆర్ వస్తే ఏం చేస్తారో... వారి ఆగ్రహం ఏ స్థాయిలో వ్యక్తం అవుతుందో...
