Asianet News TeluguAsianet News Telugu

‘గెల్లు’ను గెలిపిస్తే హుజురాబాద్‌కు 5000 డబుల్ బెడ్ రూమ్‌లు ఇచ్చే బాధ్యత నాది: హరీశ్ రావు

హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించాలని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అన్నారు. గెల్లు శ్రీనివాస్‌ను గెలిపిస్తే నియోజకవర్గానికి 5000 డబుల్ బెడ్ రూమ్‌లు ఇస్తామని, ఆ బాధ్యత తనదేనని వివరించారు. ఈటెల రాజేందర్ తన స్వార్థం కోసమే బీజేపీలో చేరాడని, ఆ పార్టీలో చేరి ఆయన ఏం చేస్తాడో వివరించాలని అడిగారు.
 

will give 5000 double bed rooms to huzurabad says minister harish rao
Author
Hyderabad, First Published Sep 25, 2021, 6:25 PM IST

హైదరాబాద్: హుజరాబాద్(Huzurabad) నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్(TRS) సీనియర్ నేత హరీశ్ రావు(Harish Rao) వరాలు కురిపించారు. నియోజకవర్గ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు. గెల్లు శ్రీనివాస్‌ను గెలిపిస్తే నియోజకవర్గ ప్రజల కోసం 5000 డబుల్ బెడ్ రూమ్‌(Double Bed Rooms)లు ఇచ్చే బాధ్యత నాదని హామీనిచ్చారు. హుజురాబాద్ ఎన్నిక న్యాయానికి, అన్యాయానికి మధ్య జరుగుతున్న ఎన్నిక అని అన్నారు. ధర్మానికి, అధర్మానికి జరుగుతున్న పోరాటమని చెప్పారు. అందుకే ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి టీఆర్ఎస్‌కే ఓటేయాలని సూచించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం ఎంతో కృషి చేసిందని హరీశ్ రావు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వారి సంక్షేమం కోసం ఏమేం చేసిందో గుర్తుపెట్టుకోవాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజాపక్షతి అని అన్నారు. కానీ, బీజేపీ అన్ని రకాల పన్నులు పెంచిందని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ అధికారం చెలాయించాలని ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.

ఈటెల రాజేందర్‌(Etela Rajender)కు ఓటమి భయం పట్టుకుందని హరీశ్ రావు అన్నారు. ఆ భయంతో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఆయన నోటి నుంచి పచ్చి అబద్ధాలు వస్తున్నాయని తెలిపారు. ఆయన మాటల్లో ఎంత వాస్తవమున్నదో ప్రజలే ఆలోచించాలని అన్నారు. నేతి బీరకాయల్లో నెయ్యి ఉండదని, అలాగే, రాజేందర్ మాటల్లో నిజం ఉండదని ఎద్దేవా చేశారు. రాజేందర్ దిగజారి మాట్లాడుతున్నాడని, కేవలం ఆయన స్వార్థం కోసమే బీజేపీలో చేరాడని విమర్శించారు. భవిష్యత్‌లో రెడ్డి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచేది కేవలం కేసీఆర్ ప్రభుత్వమేనని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios