తెలంగాణలో ఈ యాసంగి సీజన్ లో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని ప్రభుత్వం సూచిస్తోంది. అందులో భాగంగానే వరి వేయని రైతులకు రైతుబంధు పెట్టుబడి సాయం జమచేయకూడదని ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో సీఎం కేసీఆర్ రేపు నిర్ణయం తీసుకోనున్నారు.
వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ప్రభుత్వం గత రెండు నెలలుగా రైతులకు సూచిస్తోంది. యాసంగిలో పండే వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనబోదని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రం అనేదే ఉండదని సీఎం కేసీఆర్ ఒక సమావేశంలో చెప్పారు. అయితే రైతులు పెద్దగా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపకపోవడంతో ప్రభుత్వం ఓ కఠిన నిర్ణయం తీసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వరి సాగు చేసే రైతులకు రైతు బంధు ఇవ్వొద్దని ఆలోచనను వ్యవసాయ శాఖ సీఎం కేసీఆర్ ముందుంచినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో రేపు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.
రెండో సారి అధికారంలోకి తేవడంలో ‘రైతుబంధు’ కీలకపాత్ర
తెలంగాణ మొదటి సారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. అందులో రైతుల కోసం రెండు ముఖ్యపథకాలు తీసుకొచ్చింది. అందులో ఒకటి రైతుబంధు కాగా మరొకటి రైతుబీమా. ఈ రెండు పథకాలను రైతుల నుంచి విశేషంగా ఆకర్షించాయి. గతంలో ఉన్న ఏ ప్రభుత్వాలు ఇలాంటి పథకాలు తీసుకురాకపోవడంతో సీఎం కేసీఆర్ ఈ రెండు పథకాలతో రైతులకు దగ్గరయ్యారు. పట్టదారు పాసు పుస్తకం ఉన్న రైతు చనిపోతే ఏ కారణంతో చనిపోయినా కుటంబానికి రూ.5 లక్షల బీమా అందించడం రైతు బీమా పథకం ఉద్దేశమైతే, పంట పెట్టుబడికి కావాల్సిన ఆర్థిక వనరులు సమకూర్చడం రైతుబంధు పథకం ఉద్దేశం.
ప్రతీ ఏటా రెండు విడతలుగా అంటే వానాకాలం సీజన్‌కు ముందు, యాసంగి సీజన్‌కు ముందు ఎకరానికి రూ.5 వేల చొప్పున పంట పెట్టుబడికి ప్రభుత్వం సాయంగా అందిస్తోంది. ఇది డైరెక్ట్ గా రైతుల బ్యాంక్ అకౌంట్‌లో క్రిడిట్ అవడం, మధ్యలో ఎలాంటి వారికి డబ్బులు చెల్లించాల్సి రాకపోవడంతో రైతులు ఈ పథకం పట్ల బాగా ఆకర్శితులయ్యారు. టీఆర్ఎస్ ను రెండో సారి అధికారంలోకి తీసుకురావడానికి ఈ పథకం కీలక పాత్ర పోషిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దీనిని చూసే ఏపీలో జగన్ ప్రభుత్వం రైతు భరోసా అనే పథకం ప్రారంభించింది. దీని ద్వారా కూడా రైతు పెట్టుబడికి అవసరమైన సాయం చేస్తోంది అక్కడి ప్రభుత్వం.
ఇప్పుడెందుకు మరి ఇలా ?
రైతుబంధు పథకం కింద ప్రభుత్వం రైతులకు ప్రతీ ఏటా రెండు సార్లు డబ్బులు అందిస్తోంది. అయితే ఈ సారి వరి వేసే రైతులకు మాత్రం రైతుబంధు నిలిపివేస్తారనే వార్త చక్కర్లు కొడుతోంది. హుజూరాబాద్ ఎన్నికల సమయం నుంచే వరి ధాన్యం కొనుగోళ్లలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికలకు సరిగ్గా కొన్ని రోజుల ముందు ప్రభుత్వం వరి వేయొద్దని, వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించింది. దీంతో రైతుల్లో పెద్ద ఎత్తున్న ఆందోళన వ్యక్తం అయ్యింది. దీంతో రంగంలోకి సీఎం కేసీఆర్ దిగారు. వరి ఎందుకు వేయొద్దని ప్రభుత్వం చెబుతోందో వివరించారు. ఎఫ్‌సీఐ ఈ సీజన్‌లో పండే ధాన్యాన్ని కొనబోనని చెబుతోందని, అందుకే లాభసాటిగా ఉండే ఇతర ప్రత్యామ్నాయ పంటలు పండించాలని చెప్పారు. రైతుల నుంచి వ్యతిరేకరావడంతో తప్పు తమది కాదని చెబుతూ ధర్నాలు, ఆందోళనలు సైతం నిర్వహించారు. కానీ వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఏటా రైతులకు కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు లేకపోవడంతో ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తప్పని భావిస్తున్నారు.
కొందరు రైతులు ప్రభుత్వం సూచించిన విధంగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేందుకు సిద్ధమవుతుంటే.. వేరే పంటలు పండని పొలాల్లో రైతులు వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. దీంతో అలాంటి వారికి రైతుబంధు పెట్టుబడి సాయం నిలిపివేయాలని ప్రభుత్వం చూస్తోందని సమాచారం. ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటేనే రైతులు వరికి బదులు ఇతర పంటలు పండిస్తారని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో రేపు అన్ని జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటారని సమాచారం.
