బావతో ఎఫైర్:పెళ్ళైన ఆర్నెళ్లలోనే భర్త హత్యకు కుట్ర

Wife trying to kill her husband with the help of lover
Highlights

వివాహేతర సంబంధంతో భర్త హత్యకు ప్లాన్

వరంగల్:  బావతో వివాహేతర సంబంధం కారణంగా భర్తను హత్య చేయాలని భార్య ప్లాన్ చేసింది.  పెళ్ళైన ఆరు మాసాలకే భర్తను హత్య చేయాలని బావపై ఒత్తిడి తెచ్చింది.ప్రియురాలి పోరు భరించలేక మరో ఇద్దరు స్నేహితుల సహాయంతో ప్రియురాలి భర్తను చంపేందుకు ప్రయత్నించి విఫలయ్యాడు బావ. సీసీటివి పుటేజీ ఆధారంగా  ఈ ఘటనలో పాల్గొన్న నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. జనగామ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకొంది.  

యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన పోషయ్య పెద్దకూతురు గాయత్రికి విజయవాడకు చెందిన పత్తి శ్రీనుతో ఏడేళ్ళ క్రితం వివాహమైంది. అక్క వద్దకు ఆమె చెల్లి అప్పుడప్పుడు వెళ్ళేది. ఆ క్రమంలోనే అక్క భర్త శ్రీనివాస్ తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే ఆరు మాసాల క్రితం  ఆశ్వరావుపల్లికి చెందిన గాజుల రాజుతో ఆమెకు  వివాహమైంది.

అయితే ఈ వివాహం ఆమెకు ఇష్టం లేదు. అయినా ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పలేదు.  పెళ్ళైన తర్వాత  బావకు పోన్ చేసి నీతోనే ఉంటానని ఆమె చెప్పింది. తనకు పెళ్ళి ఇష్టం లేదని తెగేసి చెప్పింది.

బావతో ప్రతి రోజూ ఆమె ఫోన్ లో మాట్లాడేది. తన భర్తతో ఉండడం ఇష్టం లేదని ఆమె తేల్చి చెప్పింది.అయితే తన మరదలు ఫోన్లు చేయడంతో ఆమె భర్త రాజును చంపాలని శ్రీనివాస్ ప్లాన్ చేశాడు.  ఈ ప్లాన్ లో తనకు సహకరించేందుకు గాను ఇద్దరి సహాయం కోరాడు. వారిద్దరికి రూ.20 వేలను చెల్లించనున్నట్టు హమీ ఇచ్చాడు.

రాజును హత్య చేసేందుకు అతని స్వగ్రామమైన ఆశ్వరావుపల్లికి మే 20వ తేదిన శ్రీనివాస్ వచ్చాడు. ఊరు చివరన పొదల్లో యాసిడ్ బాటిల్ ను దాచిపెట్టాడు.  అదే నెల 27న విజయవాడలో పేపర్‌ ఫ్యాక్టరీలో పని చేసే సాడి వెంకటదుర్గారావు, మరో బాలుడికి రూ.20 వేలు ఇస్తానని సుపారీ మాట్లాడుకుని వారితో గ్రామానికి వచ్చాడు.


అయితే  అదే రోజున రాజును హత్య చేసేందుకు ప్రయత్నించారు. కానీ, రాజు ఆచూకీ లబ్యం కాలేదు. దీంతో వెనుదిరిగారు. మరో వైపు ఈ నెల 3వ తేదిన పొలాల వద్ద గొర్రెలను మేపుతున్న రాజును చూసిన శ్రీనివాస్ గతంలో తాను దాచిపెట్టిన యాసిడ్ బాటిల్ ను తన ఇద్దరు మిత్రులకు ఇచ్చి రాజును హత్య చేయాలని పంపాడు. తాను మాత్రం  చెట్ల పొదల్లో దాచుకొని రాజును హత్య చేసే ఉదంతాన్ని పరిశీలించారు.  రాజు ముఖంపై  శ్రీనివాస్ మిత్రులు యాసిడ్ పోసి గొంతు పిసికి చంపే ప్రయత్నం చేశారు.

అయితే రాజు కేకలు వేయడంతో మిగిలిన గొర్రెల కాపరులు రావడంతో నిందితులు పారిపోయారు. రాజును ఆసుపత్రికి తరలించారు. రాజు ఆసుపత్రిలో చికిత్సపొంది ఇంటికి చేరుకొన్నాడు.

అయితే రాజుపై హత్యాయత్నం కేసుకు సంబంధించిన విషయమై పోలీసులు కేసు నమోదు చేసి  దర్యాప్తు చేశారు. సీసీపుటేజీ దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. అంతేకాదు రాజు భార్య మూడు మాసాల వ్యవధిలో 1500 సార్లు తన బావకు ఫోన్ చేసిన విషయాన్ని గుర్తించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. దీంతో జ్యోతి అసలు విషయాన్ని వెల్లడించింది. 
 

loader