ఆమెకు పదిహేనేళ్ల క్రితమే పెళ్లైంది. ఇన్ని సంవత్సరాలు వీరి వివాహ బంధం సజావుగానే సాగింది. ఈ దంపతులకు ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. కానీ... కొంతకాలం క్రితం ఈ దంపతుల మధ్యలోకి మరో వ్యక్తి వచ్చాడు. అతనితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ బంధానికి భర్త అడ్డుగా కనిపించాడు. దీంతో రూ.8లక్షల సుపారీ ఇచ్చి మరీ భర్తను అతి కిరాతకంగా హత్య చేయడానికి ప్రయత్నించింది. అది కుదరకపోవడంతో ఇంట్లో నుంచి పరారయ్యింది. ఈ సంఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం బాల్నేపల్లి గ్రామానికి చెందిన తల్లం కృష్ణకు పదిహేనేళ్ల క్రితం అతడి అక్క కూతురు శిరీషతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. శిరీష ఇటీవల తన భర్తపై అయిష్టతను పెంచుకుంటూ వచ్చింది. ఆ గ్రామంలోనే అరటిపండ్ల వ్యాపారం చేసే గుంటూరు జిల్లా చిన్నకొదమగండ్లకు చెందిన సిద్ధిసాయికుమార్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.

అతడి సాయంతో తన భర్తను హతమార్చేందుకు గుంటూరు జిల్లాకు చెందిన తొమ్మిది మందితో ముఠాను ఏర్పాటు చేసింది. భర్తను చంపేందుకు రూ.8లక్షల సుపారీ ఇచ్చింది. సిద్ధిసాయికుమార్‌కు కొంత అడ్వాన్స్‌గా ఇచ్చింది. శిరీష తన భర్తకు అన్నంలో విషం కలిపినా ఆ ప్రయత్నం విఫలమవ్వడంతో.. అతడికి ఈ ముఠా సభ్యులు విషపు ఇంజక్షన్‌ ఇచ్చేందుకు ప్రయత్నించారు. 

కృష్ణ తృటిలో తప్పించుకోగా.. శిరీష గత నెల 18న ఇంటి నుంచి పారిపోయింది. కృష్ణ తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఆమె గుంటూరులో ఉన్నట్లు గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకుని, విచారించగా.. కృష్ణపై రెండు సార్లు హత్యాయత్నాలు.. త్వరలో మరోమారు చేయబోయే కుట్ర కోణాలు బయటపడ్డాయి. శిరీష, సిద్ధిసాయి మరో 9 మందిని అరెస్టు చేశారు.