ఏపూరి సోమన్నకు సంకెళ్లు వేయడంపై సర్వత్రా అనుమానాలు
తెలంగాణ కవి, రచయిత, గాయకుడు ఏపూరి సోమన్నకు బేడీలు వేయించిందెవరు?
ఆ ఎమ్మెల్యే సతీమణికి ఏపూరి సోమన్నపై అంత కోపమెందుకు?
ఆ ఎమ్మెల్యే సతీమణి ఎందుకు పోలీసు స్టేసన్ కు వెళ్లాల్సి వచ్చింది?
ఏపూరి సోమన్నతో ఆమె ఎందుకు పోలీసు స్టేషన్ లోనే వాగ్వాదానికి దిగారు?
అయినా బేడీలు వేయాల్సినంత పెద్ద నేరం చేసిండా ఏపూరి సోమన్న ?
సంకెళ్లతో కట్టేయడంలో మానవ హక్కుల ఉల్లంఘన జరగలేదా?
ఫ్రెండ్లీ పోలీసులు హైదరాబాద్ కే పరిమితమా? జిల్లాల్లో ఫ్రెండ్లీ పోలీసులు లేరా?
కుటంబ వివాదాలను బజారుకు ఈడ్చారంటే కారణం ఏమిటి?
ప్రమాదకరమైన నేరాలకు ఏపూరి సోమన్న పాల్పడుతున్నారా?
ప్రజలను చైతన్యం చేసేలా పాటలు పాడినందుకే ఆయనను పోలీసులు ఉక్కు సంకెళ్లతో బంధించారా?
ఆయన ఎన్నిసార్లు పోలీసు స్టేషన్ నుంచి తప్పించుకున్నారని సంకెళ్లేసి లాకప్ కు కట్టేశారు?
ఈ ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో, సామాన్య జనాల్లో ఉదయిస్తున్నాయి.
ఏపూరి సోమన్న బంధువులు, ఆయన సన్నిహితులు చెబుతున్న వివరాల ప్రకారం...
ఏపూరి సోమన్నకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య మెయింటెనెన్స్ కింద ప్రతి నెలా 5వేలు ఇవ్వాల్సి ఉంది. అయితే ఆ డబ్బును గత కొంత కాలంగా ఆయన ఇవ్వడంలేదు. దీంతో ఆమె సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతకంటే ముందు సోమన్న భార్య... నకిరేకల్ ఎమ్మెల్యే భార్య పుష్ప అలియాస్ అరుణను సంప్రదించారని, ఆమె వెంటనే స్పందించి స్వయంగా తిరుమలగిరి వెళ్లి ఏపూరి సోమన్నకు బేడీలు వేయాలని పోలీసులపై వత్తిడి తెచ్చినట్లు తెలిసింది. అందుకే ఆ సమయంలో సోమన్నతో పోలీసు స్టేసన్ లోనే వాగ్వాదం జరిగినట్లు వీడియోలో స్పష్టమైంది.
నాపై సర్కారే కక్ష గట్టింది : ఏపూరి సోమన్న
ఏపూరి సోమన్న తన మిత్రులతో మాట్లాడుతూ తాను సర్కారుపై పాటలు పాడుతున్నందుకే తనపై కక్ష కట్టిందని ఆరోపించారు. తెలంగాణలో జరుగుతున్న పాలనపై పాటలు పాడినందుకే సంకెళ్లు వేశారని ఆవేదనా స్వరంతో ఆయన చెప్పినట్లు సోమన్న దోస్తులు అంటున్నారు.
మొత్తానికి గాయకుడు, కవి ఏపూరి సోమన్నకు ఉక్కు సంకెళ్లు వేసి తెలంగాణ పోలీసులు కాఠిన్యాన్ని ప్రదర్శించడం తగదని జనాలు అంటున్నారు.
