మెదక్: మద్యం తాగొద్దని చెప్పిన భర్తను ఓ భార్య గొడ్లలితో నరికి చంపింది. కుమారుడి సాయంతో హత్యను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించింది. మెదక్ జిల్లా చేగుంట మండలం ఇహ్రహీంపూర్ లో ఈ ఘటన మంగళవారంనాడు జరిగింది. 

ఇబ్రహీంపూర్ కు చెందిన కుమ్మరి భిక్షపతి (57) భార్య సత్తవ్వ కొన్నాళ్లుగా మద్యానికి అలవాటు పడింది. ఆ అలవాటు మానుకోవాలని భిక్షపతి పదే పదే చెబుతూ వస్తున్నాడు. ఈ విషయంలో ఇరువురి మధ్య గొడవలు జరుగుతూ వస్తున్నాయి. 

తాజాగా దంపతుల మధ్య గొడవ జరిగింది. కోపంతో సత్తవ్వ భర్త భిక్షపతి ముఖం మీద గొడ్డలితో వేటు వేసింది. తీవ్రంగా రక్తస్రావం జరిగి అతను స్పృహ కోల్పోయాడు. కొడుకు స్వామి సాయంతో సత్తవ్వ భిక్షపతిని ఆస్పత్రికి తరలిస్తుిండగా మార్గమధ్యంలోనే అతను కన్నుమూశాడు. 

ఆ తర్వాత ఇంట్లోని రక్తం మరకలను తుడిచేశారు. దుస్తులను సమీపంలోని పాడుబడిన బావిలో పడేశారు. కిందపడి ముఖానికి దెబ్బలు తగలడం వల్ల భిక్షపతి మరణించాడని చెప్పి నమ్మించే ప్రయత్నం చేశారు. 

అయితే, ముఖంపై గొడ్డలి గాట్లు కనిపించడంతో నిలదీశారు. దాంతో నేరాన్ని సత్తవ్వ అంగీకరించింది. స్వామి భార్య హత్య కేసులో కూడా స్వామి, సత్తవ్వ నిందితులు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.