Asianet News TeluguAsianet News Telugu

మునుగోడు కాల్పుల ఘటన.. ఉపాధ్యాయుడితో వివాహేతర సంబంధంతోనే భర్త హత్యకు ప్లాన్..

నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని ఊకొండి గ్రామంలో ఇటీవల చోటుచేసుకున్న కాల్పుల ఘటనకు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నార్కట్‌పల్లి మండలం బి వెల్లెంల గ్రామానికి చెందిన నిమ్మల లింగస్వామి కాల్పుల జరిపిన కేసులో పోలీసులు 9 మందిని అరెస్ట్ చేశారు. 

Wife her lover others arrested murder attempt on man in Munugode
Author
First Published Aug 13, 2022, 5:41 PM IST

నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని ఊకొండి గ్రామంలో ఇటీవల చోటుచేసుకున్న కాల్పుల ఘటనకు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నార్కట్‌పల్లి మండలం బి వెల్లెంల గ్రామానికి చెందిన నిమ్మల లింగస్వామి కాల్పుల జరిపిన కేసులో పోలీసులు 9 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద  నుంచి  తుపాకి, మ్యాగజైన్, 9 ఫోన్లు, రూ.4,500 నగదు, ప్రామిసరి నోట్, రెండు చెక్ బుక్కులు స్వాధీనం చేసుకున్నారు. అయితే లింగస్వామి మీద హత్య ప్రయత్నం వెనక అతని భార్య, ఆమె ప్రియుడి హస్తం ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. వివాహేతర సంబంధమే ఈ హత్యయత్నం వెనక ఉన్న కారణమని నిర్దారించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నల్గొండ జిల్లా ఎస్పీ రెమారాజేశ్వరి మీడియాకు వెల్లడించారు. 

మర్రిగూడ మండలం తుమ్మడపల్లికి చెందిన చింతపల్లి బాలకృష్ణ హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో నివాసం ఉంటున్నాడు. అతడు ప్రస్తుతం బి వెల్లెంల గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. ఆ స్కూల్‌లోనే మధ్యాహ్నం భోజన కార్మికురాలుగా పనిచేస్తున్న నిమ్మల సంధ్యతో పరిచయం ఏర్పడింది. సంధ్యకు అప్పటికే నిమ్మల లింగస్వామితో వివాహం జరిగింది. అయితే సంధ్య, బాలకృష్ణల మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే తనను పెళ్లి చేసుకుంటే పొలం రాసి ఇవ్వడంతోపాటు డబ్బులు ఇస్తానని సంధ్యకు బాలకృష్ణ ఆశ చూపాడు. తమ బంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో లింగుస్వామిని హత్య చేయాలని.. సంధ్య, బాలకృష్ణలు నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలోనే లింగస్వామిని హత్య చేయించాలని పథకం వేశారు.  

తొలుత లింగస్వామిని హత్య చేసేందుకు రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్‌కు చెందిన కనుక రామస్వామి, నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం వింజమూరు గ్రామానికి చెందిన పోల్‌ గిరిబాబు, యాచారం మండలం మాల్‌కు చెందిన రత్నాల వెంకటేశ్, బి.వెల్లంల గ్రామానికి చెందిన మహ్మద్‌ మొయినొద్దీన్‌లను బాలకృష్ణ సంప్రదించారు. హత్యకు రూ.3 లక్షల సుపారీ ఇచ్చేందుకు డీల్ కుదుర్చుకున్నారు. అడ్వాన్స్‌గా రూ. 1.7 లక్షలు ఇచ్చారు. అయితే లింగస్వామి హత్యకు వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రోజులు గడిచిన హత్య జరగకపోవడంతో.. తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని బాలకృష్ణ వారిపై ఒత్తిడి చేశాడు. దీంతో వారు ప్రామిసరీ నోట్, బ్యాంకు చెక్‌బుక్‌లు బాలకృష్ణకు ఇచ్చారు. 

మరో ప్రయత్నంలో భాగంగా.. వనస్థలిపురంలో  ప్లంబర్‌గా పనిచేసే యూసుఫ్‌ను బాలకృష్ణ‌ సంప్రదించారు. దీంతో యూసుఫ్‌ తనకు పరిచయస్తులైన హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్‌ రెహమాన్, మహ్మద్‌ జహంగీర్‌ పాష అలియాస్‌ బాబు, ఏపీలోని చిలుకలూరిపేటకు చెందిన పఠాన్‌ ఆసిఫ్‌ఖాన్‌లతో కలసి.. లింగస్వామిని హత్య చేసేందుకు రూ.12 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ముందుగా వారికి బాలకృష్ణ రూ.5 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించాడు. ఇందులో రూ.లక్ష నిమ్మల సంధ్య మహిళాసంఘంలో డబ్బులు తీసుకొని బాలకృష్ణకు అందజేసింది. 

ఇక, యూసఫ్ గ్యాంగ్‌.. లింగుస్వామిని హత్య చేసేందుకు ప్రణాళికలు రచించింది. ఇందుకోసం బిహార్‌లో ఓ తుపాకిని కొనుగోలు చేశారు. ఈ నెల 4న లింగస్వామిపై యూసుఫ్‌ గ్యాంగ్‌ తుపాకితో మూడు రౌండ్ల కాల్పులు జరిపింది. అయితే ఇది గమనించిన చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. లింగస్వామిని హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం లింగస్వామికి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇందుకు సంబంధించి పోలీసులు లింగస్వామి నుంచి వివరాలు సేకరించడంతో పాటుగా.. అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే మొత్తం 10 మంది నిందితులను గుర్తించారు. వారిలో 9 మందిని అరెస్ట్ చేశారు. 

పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో.. సంధ్య, బాలకృష్ణ, అబ్దుల్‌ రెహమాన్, మహ్మద్‌ జహంగీర్‌ పాష అలియాస్‌ బాబు, పఠాన్‌ ఆసిఫ్‌ఖాన్‌, కనుక రామస్వామి, రత్నాల వెంకటేష్, పోల్‌ గిరిబాబు, మహ్మద్‌ మోయినొద్దీన్‌లు ఉన్నారు. మరో నిందితుడైన మహ్మద్‌ యూసుఫ్‌ పరారీలో ఉన్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios