ప్రేమ పేరుతో యువతులను మోసం చేస్తున్న భర్తమీద భార్య ఫిర్యాదు చేసిన ఘటన హైదరాబాద్ లోని చందానగర్ లో చోటు చేసుకుంది. ఆంధ్రా అమ్మాయిలు, హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లే టార్గెట్‌గా లవ్ ఎఫెయిర్లు నడిపి వారిని మోసం చేస్తున్న ఓ మోసగాడి గుట్టు రట్టయ్యింది. 

ఇతను ఇప్పటి వరకు ఆరుగురు యువతులను మోసం చేసి డబ్బులు దండుకున్నాడు. ఫేస్‌బుక్‌లో పరిచయం పెంచుకుని ఆపై ప్రేమ, పెళ్లితో లొంగదీసుకుంటాడు. 

పెళ్లి చేసుకున్న భార్యను వదిలించుకోవడానికి వేధింపులకు పాల్పడటంతో భర్త చేస్తున్న దారుణాలపై భార్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఈ దుర్మార్గుడి అసలు రంగు బయటపడింది.

వివరాల్లోకి వెళితే.. చందానగర్ ఆర్టీసీ కాలనీకి చెందిన కుర్ర విజయభాస్కర్‌పై భార్య సౌజన్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో అతడిపై కేసు నమోదు అయ్యింది.  2017 జూన్‌లో సౌజన్యను  వివాహం చేసుకున్న కుర్ర విజయభాస్కర్.. ఆ తరువాత మేనకోడలిపై కన్నేశాడు. ఆ తర్వాత మరో ఇద్దరికి పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. ఇలా ఆరుగురు యువతులను మోసం చేశాడని పోలీసులు చెబుతున్నారు. 

ఇవన్నీ  తెలిసీ భరిస్తున్నా.. తనపై అత్తింటివారంతా కలిసి వేదింపులకు గురిచేశారని సౌజన్య వాపోయింది. నమ్ముకుని వస్తే జీవితాన్ని నాశనం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన దగ్గర నుంచి 25తులాల బంగారం, 15 లక్షల కట్నం తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. తనకు మూడేళ్ల బాబు ఉన్నాడని, ఎలాగైనా న్యాయం చేయాలని పోలీసులను కోరింది.