భర్త మరణం తట్టుకోలేక ఓ గృహిణి ఉరి వేసుకున్న ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన హైదరాబాద్ లోని చిలకలగూడలో చోటుచేసుకుంది. పదకొండేళ్ల అన్యోన్య దాంపత్యజీవితం, ఇద్దరు అల్లారు ముద్దు పిల్లలతో సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా తలకిందులయ్యింది. తండ్రి మృతి, తల్లి ఆత్మహత్యతో ఆ పిల్లలిద్దరూ అనాధలయ్యారు. 

బ్రెయిన్‌ స్ట్రోక్‌తో నెలన్నర క్రితం భర్త మృతి చెందాడు. భర్త జ్ఞాపకాలను మర్చిపోలేక భార్య ఉరి వేసుకొని తనువు చాలించింది. ఈ హృదయ విదారకర ఘటన చిలకలగూడ ఠాణా పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన మేరకు.. బౌద్ధనగర్‌ డివిజన్‌ మహ్మద్‌గూడకు చెందిన శ్రీనివాస్‌(38), హేమలత (32)లు భార్యభర్తలు. వీరికి ఐశ్వర్య (10), అభిలాష్‌ (08) ఇద్దరు పిల్లలు. వెల్డింగ్‌షాపు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌ రెండునెలల క్రితం అస్వస్థతకు గురయ్యాడు. 

ఈ క్రమంలో బ్రెయిన్‌స్ట్రోక్‌ రావడంతో గతేడాది నవంబరు 17న మృతి చెందాడు. హఠాత్తుగా భర్త మృతి చెందడంతో భార్య హేమలత తీవ్ర మనస్తాపానికి గురైంది. భర్త జ్ఞాపకాలను తలుచుకుని తనలోతానే కుమిలిపోయేది. ఎప్పుడూ ఒంటరిగా ఉండేది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూలేని సమయంలో తన గదిలోని సీలింగ్‌ ఫ్యానుకు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. 

మధ్యాహ్నం 2 గంటల సమయంలో కుమారుడు అభిలాష్‌ వచ్చి చూడగా తల్లి ఉరికి వేలాడుతూ కనిపించింది. చిన్నారి ఏడుస్తు సీలింగ్‌ ఫ్యానుకు అమ్మ వేలాడుతుందని చెప్పడంతో కుటుంబసభ్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. భర్త మరణాన్ని తట్టుకోలేక హేమలత ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.