నలుగురికి ఆదర్శంగా ఉంటూ సమాజానికి మంచి చెడు చెప్పాల్సిన పోలీసు అధికారి దారి తప్పాడు.. ఒకరి తర్వాత ఒకరు చొప్పున మూడు పెళ్లిళ్లు చేసుకుని.. వారిపై మోజు తీరాక నాలుగో పెళ్లికి సిద్ధమయ్యాడు.. దీంతో ఆయనగారి భార్య ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.

వివరాల్లోకి వెళితే... సూర్యాపేట జిల్లా మునగాల మండలం నారాయణగూడ గ్రామానికి చెందిన కొలుకలపల్లి రాజయ్య 2009లో తాండూరు సమీపంలోని కరణ్‌కోర్ట్ ఠాణాలో ఎస్సైగా పనిచేశాడు.. ఓ వివాదం విషయంలో పరిష్కారం కోసం తనను ఆశ్రయించిన రేణుక అనే యువతితో పరిచయం పెంచుకుని.. ఆమెను పెళ్లి చేసుకున్నాడు.

అంతకు ముందే తనకు రెండు పెళ్లిళ్లు అయ్యాయని.. వారిద్దరూ చనిపోయారని ఆమెకు మాయమాటలు చెప్పాడు. ఇటీవలి వరకు ఆసిఫ్‌నగర్‌ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన రాజయ్య గత నెల 24వ తేదీన అక్కడి నుంచి బదిలీ అయ్యాడు. అయితే ఇన్నాళ్లు బాగానే చూసుకున్న తన భర్త ప్రవర్తనలో రేణుకకు మార్పు కనిపించింది.

గత నెల 2వ తేదీ నుంచి ఇంటికి రావడం మానేయడంతో ఆమె రాజయ్యను నిలదీయగా... ఇకపై సొంతంగా బతకాలంటూ చెప్పాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం రీటా అనే యువతితో అతను మరో పెళ్లికి సిద్ధమవుతున్నాడని.. తనను మన్సూరాబాద్‌లోని అద్దె ఇంట్లో ఉంచి... సదరు మహిళను హయత్‌నగర్‌ సమీపంలోని మునగనూరులోని సొంత ఇంట్లో ఉంచాడని తెలిపింది.

దీంతో ముగ్గురు పిల్లలు, తన భవిష్యత్ ప్రమాదంలో పడిందని న్యాయం చేయాలని కోరుతూ.. రాచకొండ పోలీస్ కమీషనర్ మహేశ్ భగవత్‌కు రేణుక ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.