కట్టుకున్న భర్తను ఓ మహిళ అతి దారుణంగా హత్య చేసింది. జీవిత చరమాంకంలో తోడు ఉండాల్సిన భర్తను తన చేతులతో తాను స్వయంగా హత్య చేసింది. కళ్లల్లో కారం చల్లి మరీ.. కత్తితో అతి కిరాతకంగా నరికి హతమార్చింది.  ఈ సంఘటన గోదావరిఖనిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  సింగరేణి జీడీకే7-ఎల్ఈపీ గనిలో ట్రామర్ గా పనిచేసే కొయ్యడ చంద్రయ్య(58) కి భార్య భాగ్యమ్మ, ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. నలుగురికి పెళ్లిళ్లు కాగా... చంద్రయ్య, భార్య, కొడుకు, కోడలితో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాడు. శుక్రవారం డ్యూటీకీ వెళ్లి ఇంటికి వచ్చిన చంద్రయ్య... తన గదిలో పడుకున్నాడు.

ఆ సమయంలో భార్య భద్రమ్మ.. కంట్లో కారం చల్లి.. అనంతరం పదునైన కత్తితో మెడమీద నరికి హత్య చేసింది. నుదురు, కాళ్లు, చేతులపై కూడా తీవ్రంగా గాయాలు చేసింది. దీంతో అతను తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. తన భర్త మద్యానికి బానిసగా మారి రోజూ ఇంటికి తాగి వచ్చేవాడని.. ఆ మైకంలో తనని నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేశాడని... ఆ బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె చెప్పారు.

కాగా... హత్య ఆమె ఒక్కతే చేసిందా.. లేక మరెవరైనా సహాయం చేశారా అన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.