గ్రేటర్ వార్ హైదరాబాద్ ను రణరంగంగా మార్చేసింది. ఓట్ల కోసం నేతలు చేసే జిమ్మిక్కుల్లో ప్రజలు ముఖ్యంగా అసలేం సంబంధం లేని వాళ్లు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అలాంటి ఓ అంశమే రొహింగ్యాలు. పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్స్ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా ప్రచారం హీటెక్కింది. వాదనలు, ప్రతివాదనలతో రాజకీయ యుద్ధానికి తెర లేచింది. 

పాతబస్తీలో పాకిస్థాన్‌, మయన్మార్‌ దేశాల నుంచి వచ్చిన అక్రమ వలసదారులు ఉన్నారని, వీళ్లంతా మజ్లీస్‌ పార్టీ ఓట్‌ బ్యాంక్‌ అని బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది. దీనిమీద ఒవైసీ బ్రదర్స్‌ కౌంటర్‌ అటాక్‌ చేశారు. ఇతర దేశాల నుంచి అక్రమంగా దేశంలోకి చొరబడుతుంటే కేంద్ర నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయని, ఎన్నికల వేళ ఓట్లు కావల్సిన సమయంలోనే ఇది గుర్తొచ్చిందా అంటూ ప్రతి దాడికి దిగారు. అంతేకాదు 24 గంటల్లో అక్రమవలసదారులు ఎక్కడున్నారో చూపించాలని అసదుద్దీన్ ఓవైసీ హోంమంత్రి అమిత్‌షాకు సవాల్‌ కూడా విసిరారు.

అసలు రొహింగ్యాలు అంటే ఎవరు? వీరికి పాతబస్తీకి సంబంధం ఏమిటి? ఇప్పుడు వీరి ప్రస్తావన ఎందుకొచ్చింది.. అంటే అందరికీ సులభంగా అర్థమయ్యే విషయమే ఎన్నికల్లో గెలుపుకోసం అనేది. అయితే అసలీ రొహింగ్యాలు ఎవరంటే.. వీరు ప్రధానంగా మయన్మార్ దేశంలోని రఖైన్ రాష్ట్రానికి చెందిన వారు. వీరిని ఆ దేశం తమ పౌరులుగా గుర్తించడం లేదు. 

పరిస్థితులు మరింత ముదిరడంతో 2012లో రోహింగ్యాలపై మిలిటరీ చర్యలకు దిగింది మయన్మార్. దీంతో ఇల్లూ, వాకిలి వదిలి కట్టుబట్టలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశ సరిహద్దులు దాటారు రొహింగ్యాలు. రోడ్డు, సముద్ర మార్గాన చుట్టూ ఉన్న దేశాలకు చేరారు. అలా కొంతమంది బంగ్లాదేశ్‌లో అడుగు పెట్టారు. 

మరి కొంతమంది మలేషియా, ఇండోనేషియా వైపు వెళ్లి స్థిరపడ్డారు. అయితే బంగ్లాదేశ్‌  లో అడుగుపెట్టిన వాళ్లలో కొంతమంది అక్కడి నుంచి భారతదేశంలోకి కూడా ప్రవేశించారు. బంగ్లాదేశ్‌ నుంచి ఈశాన్య రాష్ట్రాల్లోకి, అటు నుంచి ఇతర రాష్ట్రాల్లోకి ప్రవేశించి స్థిరపడ్డారు. 

రొహింగ్యాలు ముస్లింలు కావడంతో ఆ వర్గం జనాభా ఎక్కువగా ఉండే అసోం, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, జమ్మూకశ్మీర్, తెలంగాణ, కేరళల్లో క్యాంపులు ఏర్పాటు చేసుకున్నారు. మయన్మార్‌ నుంచి వచ్చిన రొహింగ్యా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి పాతబస్తీలో ప్రత్యేకంగా క్యాంపును ఏర్పాటు చేసింది. 

వీరికి ఐక్యరాజ్యసమితి శరణార్థి గుర్తింపు కార్డులు కూడా ఇచ్చింది. ఈ కార్డు మీద వారి వివరాలతో పాటు, గుర్తింపు కార్డు ఇచ్చిన తేదీ, ఎక్స్ పైరీ వివరాలు కూడా ఉంటాయి. మామూలుగా గడువు తేదీ ముగిస్తే ముందే రెన్యువల్ కు అప్లై చేసుకుని చేయించుకుంటుంటారు. గడువు తేదీ తర్వాత కూడా ఇక్కడే ఉంటే, అక్రమంగా నివసిస్తున్నట్లు లెక్క. అల పాతబస్తీలోని బాలాపూర్‌, రాయల్‌ కాలనీల్లో రొహ్యింగాలు ఎక్కువగా ఉన్నారు. 

వీరిలో కొంతమంది క్యాంపుల్లో ఉన్నారు. మరికొంత మంది పాతబస్తీలోని ఇతర ప్రాంతాల్లో అద్దెకు ఉంటున్నారు. వీరంతా రోజు కూలీలు చేసుకునే వారే. అలా హైదరాబాద్‌లో అధికారికంగా 5నుంచి 6 వేలమంది రొహింగ్యాలు ఉన్నారని అంచనా. 

అయితే స్థానికులు మాత్రం రొహింగ్యాల వల్ల తమకు ఏ ఇబ్బందీ లేదని అంటున్నారు. ఎన్నికల కోసమే పార్టీలు రొహింగ్యాల అంశాన్ని వాడుకుంటున్నాయని చెబుతున్నారు. ఇక ఇంత చర్చకు కారణమైన రొహింగ్యాలకు మాత్రం ఇవేవీ తెలియవు.