కాంగ్రెస్ రేవంత్ కు మరో నెత్తి నొప్పి

కాంగ్రెస్ రేవంత్ కు మరో నెత్తి నొప్పి

కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డికి మరో ప్రధాన సమస్య వెంటాడుతున్నది. ఆయన పార్టీలో చేరిన నాటినుంచి ఆ సమస్య రేవంత్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. పైకి చెప్పుకోలేక రేవంత్ సతమతమయ్యే సమస్య అది. మరి ఆ సమస్య కూడా ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ కు మరో క్రొకడైల్ ఫెస్టివల్ గా మారింది. మరి ఈ విషయాల కోసం ఈ స్టోరీ చదవండి.

కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి జోష్ ఇప్పుడు రేవంత్ రెడ్డిలో అంతగా కనిపించడంలేదు. ఆయనలోనే కాదు కాంగ్రెస్ లోనూ జోష్ కొంత తగ్గిందన్న వాతావరణం ఉంది. ఎందుకంటే గతంలో టిడిపిలో ఉన్న సమయంలో రేవంత్ ఆడింది ఆట పాడింది పాట అన్నట్లు పూర్తి స్వేచ్ఛ ఉండేది. టిడిపిలో ఆయన టాప్ 2 లీడర్లలో ఒకరుగా ఉండేవారు. ఇంకోమాటలో చెప్పాలంటే టాప్ వన్ లీడర్ ఆయనే అనే వాతావరణం కకూడా టిడిపిలో నెలకొంది. కానీ మహాసముద్రమైన కాంగ్రెస్ లో రేవంత్ పరిస్థితి అలా మాత్రం లేదనే చెప్పాలి. ఇక్కడ హేమాహేమీలు ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో రేవంత్ నెట్టుకు రావాల్సిన అవసరం ఉంది.

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి రెండు వారాలు గడుస్తున్నా ఆయన ఒక విషయంలో తీవ్రమైన ఇబ్బంది నెలకొంది. రాహుల్ గాంధీ సమక్షంలో ఢిల్లీ వెళ్లి రేవంత్ కాంగ్రెస్ కండవా కప్పించుకుని పార్టీలో చేరిపోయారు. కానీ ఆరోజు నుంచి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం.. కాంగ్రెస్ గుండెకాయ లాంటి గాంధీభవన్ లో అడుగు పెట్టలేదు. ఏ నాయకుడైనా పార్టీలో చేరగానే గాంధీభవన్ వచ్చి హడావిడి చేయడం జరుగుతుంది. కానీ గత పదిహేను రోజులుగా రేవంత్ గాంధీభవన్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు.

కాంగ్రెస్ లో చేరిన తర్వాత రేవంత్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి, సర్వే సత్యనారాయణ, అంజన్ కుమార్ యాదవ్, పొన్నాల లక్ష్మయ్య లాంటి నాయకుల ఇండ్ల వద్దకు వెళ్లి వారితో కర్టసీ సమావేశాలు జరిపారు. వారి ఆశిస్సులు అందుకున్నారు. కానీ గాంధీభవన్ మెట్లెక్కలేదు. ఎందుకు రేవంత్ గాంధీభవన్ లో కాలు పెట్టలేదన్నదానిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.

రేవంత్ రెడ్డికి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఏ పదవీ ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో ఆయన గాంధీభవన్ కు పోయి ఏం చేస్తారు అన్న వాదన వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ కు ఏదైనా పోస్టు వచ్చిన తర్వాతే గాంధీభవన్ కు వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. పోస్టు వచ్చిన వెంటనే రేవంత్ కు పార్టీ ఆఫీసులో ఛాంబర్ కూడా కేటాయిస్తారని, తద్వారా ఆయన తన పని తాను చేసుకుంటూ వెళ్లొచ్చని చెబుతున్నారు. ‘‘ఇప్పటికిప్పుడు గాంధీభవన్ కు పోతే ఎక్కడ కూర్చోవాలో కూడా తెలియదు కదా? అందుకే రేవంతన్న గాంధీభవన్ కు పోతలేడు’’ అని ఆయన సన్నిహితుడొకరు సమర్థించుకున్నారు. రేవంత్ రెడ్డికి పార్టీలో పోస్టు ఇవ్వడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అప్పటి వరకు రేవంత్ గాంధీభవన్ కు దూరంగానే ఉంటాడని అంటున్నారు.

ఏది ఏమైనా పార్టీలో చేరి రెండు వారాలు పూర్తవుతున్నా ఇంకా రేవంత్ గాంధీభవన్ మెట్లెక్కకపోవడం రాయల్ కాంగ్రెస్ లీడర్లకు నచ్చడంలేదు. పార్టీలో చేరిన తర్వాత గాంధీభవన్ కు రావడానికి సిగ్గు పడితే ఎలా అని వారు చురకలేస్తున్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Telangana

Next page