తెలంగాణ సిఎం కేసిఆర్ శుక్రవారం బెంగుళూరు వెళ్లారు. హైదరాబాద్ బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో బెంగుళూరు వెళ్లిన కేసిఆర్  దేవెగౌడ నివాసం వెళ్లారు. అక్కడ ఆయన, ఆయన కొడుకు కుమారస్వామితో భేటీ అయ్యారు. కేసిఆర్ తో పాటు ఎంపిలు వినోద్ కుమార్, సంతోష్ కుమార్, ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు దేవెగౌడతో పాటు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఘనంగా స్వాగతం పలికారు. శాల్వా కప్పి, తలపాగా పెట్టి, మెడలో దండ వేసి సన్మానించారు. గతంలో కేసిఆర్ తో పాటు సీనియర్ నేత కేశవరావు కూడా వెళ్లారు. అయితే అక్కడ కేశవరావు హడావిడి చూసి తెలంగాణ సిఎం ఎవరబ్బా అని సెక్యూరిటీ సిబ్బంది చర్చించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి బెంగుళూరు టూర్ లో మాత్రం కేకే కనిపించలేదు. ఆయన స్థానంలో కరీంనగర్ ఎంపి వినోద్ వెళ్లారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో మద్దత్తు ఇవ్వడంతో పాటు వరంగల్ లో జరిగిన భారీ బహిరంగ సభలో దేవాగౌడ పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు కేసిఆర్. ఈ భేటీ సందర్భంగా తెలంగాణ ఉద్యమానికి మద్దత్తుగా నిలిచినందుకు దేవెగౌడకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. పంటకు పెట్టుబడి మద్దతు పథకం ప్రకటించిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు దేవెగౌడ ఫోన్ చేసి అభినందించారు. హైదరాబాద్ కు వస్తానని చెప్పారు. అయితే తానే బెంగుళూరుకు వచ్చి కలిసి ఆశీర్వాదం తీసుకుంటానని అప్పుడు కేసీఆర్ చెప్పారు. దాని ప్రకారమే శుక్రవారం వచ్చి దేవెగౌడకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై చర్చించారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావడానికి తాను చేస్తున్న ప్రయత్నాలను కేసీఆర్ వివరించారు. కేసీఆర్ కృషిని దేవాగౌడ అభినందించారు. సమావేశం అనంతరం దేవెగౌడ ఇంట్లోనే మధ్యాహ్న భోజనం చేసి అనంతరం మీడియాతో మాట్లాడారు.