తెలంగాణలో బీజేపీ రాజకీయ శక్తిగా అవతరించబోతోందని  బీజేపీ జాతీయ అధ్యక్షుడు  అమిత్ షా  చెప్పారు.


హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ రాజకీయ శక్తిగా అవతరించబోతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆయన కోరారు.

బుధవారం నాడు నాంపల్లి ఎగ్జిభిషన్ గ్రౌండ్స్‌లో హైద్రాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని బూత్ స్థాయి కమిటీల అధ్యక్షుల సమావేశంలో అమిత్ షా పాల్గొన్నారు.

తెలంగాణలో మతపరమైన రిజర్వేషన్లను అడ్డుకొంటామని అమిత్ షా ప్రకటించారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల బీసీలు, దళితులకు అన్యాయం జరుగుతోందన్నారు.

తెలంగాణలో బీజేపీ ఓ గొప్ప రాజకీయ శక్తిగా మారనుందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో బీజేపీని గెలిపిస్తే దేశంలో బీజేపీ విజయం సంపూర్ణంగా మారే అవకాశం ఉందని చెప్పారు.

ఎంఐఎం నేత ఓవైసీ కోసమే కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని ఆయన విమర్శించారు. ముందస్తు ఎన్నికలకుఎందుకు వెళ్లాల్సి వచ్చిందో కేసీఆర్ చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు.