Asianet News TeluguAsianet News Telugu

Huzurabad ByPoll: ప్రత్యర్ధులిద్దరూ చోటా నేతలే.. అయినా ఈటల మెజారిటీ ఎందుకు తగ్గిందంటే..?

ప్రస్తుత హుజురాబాద్ ఉపఎన్నికకు ముందు వరుసగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్.. ప్రతి ఎన్నికలోనూ భారీగా మెజారిటీ సాధించారు. చివరి మూడు ఎన్నికల్లో ఆయన మెజారిటీ 40 వేలకు వుంది.

why etela rajender majority decreased in huzurabad bypoll 2021
Author
Huzurabad, First Published Nov 2, 2021, 10:29 PM IST

ఎగ్జిట్‌పోల్స్‌ను నిజం చేస్తూ హుజురాబాద్ ఉపఎన్నికలో (huzurabad byPoll) బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ (etela rajender) విజయం సాధించారు. తద్వారా వరుసగా ఏడోసారి ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అడుగుపెట్టబోతున్నారు. ఈ ఏడింటిలో నాలుగు సార్లు సాధారణ ఎన్నికల్లో ఆయన విజయం సాధించగా.. మూడు సార్లు ఉప ఎన్నికల్లో విజయం సాధించడం గమనార్హం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి నాలుగుసార్లు, తెలంగాణ అసెంబ్లీకి మూడుసార్లు ఈటల గెలిచారు.  

తొలుత కమలాపూర్‌ (kamalapur) నియోజకవర్గం నుంచి రెండుసార్లు విజయం సాధించగా.. ఆ తర్వాత ఐదు సార్లు హుజురాబాద్ నుంచే విజయ బావుట ఎగురవేశారు. ప్రస్తుత ఉపఎన్నికకు ముందు వరుసగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్.. ప్రతి ఎన్నికలోనూ భారీగా మెజారిటీ సాధించారు. చివరి మూడు ఎన్నికల్లో ఆయన మెజారిటీ 40 వేలకు వుంది. 2004లో అత్యత్పలంగా 19 వేల మెజారిటీతో గెలుపొందిన ఈటల..  2010 ఎన్నికల్లో అత్యధికంగా 79 వేల మెజారిటీ సాధించారు. ఆ వివరాలు ఒకసారి చూస్తే..

  • 2004లో ఉమ్మడి రాష్ట్రంలో కమలాపూర్ నియోజకవర్గం నుంచి తొలిసారి బరిలోకి దిగిన ఈటల రాజేందర్‌ .. టీడీపీ నేత ముద్దసాని దామోదర్ రెడ్డిపై 19,619 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈటల రాజేందర్‌కు 68,393 ఓట్లు పోలవ్వగా.. ముద్దసానికి 48,774 ఓట్లు పడ్డాయి. 
  • 2008లో కమలాపూర్‌ ఉపఎన్నిక సందర్భంగా ఈటల రాజేందర్.. టీడీపీ నేత ముద్దసానిపై 22,284 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈటల రాజేందర్‌కు 64,092 ఓట్లు, ముద్దసాని దామోదర్ రెడ్డికి 31,808 ఓట్లు పోలయ్యాయి. 
  • 2009 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి హుజురాబాద్ నుంచి పోటీ చేసిన ఈటల రాజేందర్ 15,035 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత వకులాభరణం కృష్ణమోహన్‌కు 41,717 ఓట్లు పోలవ్వగా.. ఈటలకు 56,752 ఓట్లు పడ్డాయి. 
  • 2010లో వచ్చిన మరో ఉపఎన్నికలో ఈటల తన సత్తా చాటారు. ఏకంగా 79,227 ఓట్ల భారీ మెజారిటీతో ఆయన గెలుపొందారు. ఆ ఎన్నికల్లో ఈటలకు 93,026 ఓట్లు పడగా.. టీడీపీ నేత ముద్దసాని దామోదర్ రెడ్డికి 13,799 ఓట్లు మాత్రమే పడ్డాయి.
  • ఇక 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తొలిసారిగా వచ్చిన ఎన్నికల్లో ఈటల రాజేందర్‌కు 95,315 ఓట్లు పడగా.. కాంగ్రెస్ నేత కేతిరి సుదర్శన్ రెడ్డి 38,278 ఓట్లు పోలయ్యాయి. తద్వారా ఈటలకు 57,037 ఓట్ల మెజారిటీ దక్కింది.
  • 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈటలకు 43,791 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈటల రాజేందర్‌కు 1,04,840 ఓట్లు పోలవ్వగా.. కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డికి 61,121 ఓట్లు పడ్డాయి. 
  • ఇప్పుడు తాజాగా జరిగిన ఉపఎన్నికలో ఈటల రాజేందర్‌కు 1,06,780 ఓట్లు పోలవ్వగా... టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు 82,712 ఓట్లు పడ్డాయి. తద్వారా దాదాపు 24 వేల పైచీలుకు ఓట్ల మెజారిటీతో ఈటల రాజేందర్ గెలుపొందారు. 

వరుస పెట్టి ప్రతి ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధిస్తూ వస్తున్న ఈటల రాజేందర్‌‌కు ఈసారి వచ్చింది కూడా తక్కువేం కాదు. అయితే అనేక అంశాలు ఈటల మెజారిటీని తగ్గించడానికి కారణమయ్యాయి. ఇందులో ప్రధానమైనది దళిత బంధు. ఎన్నికలను దృష్టిలో వుంచుకుని కేసీఆర్ ఈ పథకానికి రూపకల్పన చేశారు. నియోజకవర్గంలోని పలు దళిత కుటుంబాలకు డబ్బును వారి ఖాతాల్లో జమచేశారు కూడా. దీనిని అందుకున్న లబ్ధిదారుల్లో కొన్ని కుటుంబాలు టీఆర్ఎస్‌కు జై కొట్టాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

ఇక నియోజకవర్గంలోని బలమైన కులాలైన పద్మశాలి, గౌడ, ముదిరాజ్, యాదవలు కొన్నేళ్లుగా టీఆర్ఎస్‌కు మద్ధతుగా వుంటూ వస్తున్నారు. సహజంగానే వీటిలో కొన్ని గులాబీ పార్టీ వైపు టర్న్ అయి వుండవచ్చు. అలాగే టీఆర్ఎస్ అభ్యర్ధి అయిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ (gellu srinivas yadav) .. స్వయంగా యాదవ సామాజికి వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో.. ఆ వర్గానికి ఇక్కడ 22 వేల వరకు ఓట్లు వుండటంతో అవి చీలిపోయి వుండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వీటికి తోడు మరికొన్ని కారణాల వల్ల ఈటల రాజేందర్‌కు అనుకున్న స్థాయిలో మెజారిటీ రాలేదని తెలుస్తోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios