శ్రీశైలం: శ్రీశైలం పవర్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదానికి  గల కారణాలపై సీఐడీ టీమ్ లోతుగా దర్యాప్తు చేస్తోంది. బ్యాటరీలు మార్చే సమయంలోనే ప్రమాదం చోటు చేసుకొందని ప్రాథమిక అంచనాకు సీఐడీ అధికారులు వచ్చారు. ఈ విషయమై టెక్నికల్ టీమ్‌తో సీఐడీ అధికారులు క్షుణ్ణంగా విచారిస్తున్నారు.

సీఐడీ టీమ్ ఇప్పటికే రెండు దఫాలు శ్రీశైలం ప్రాజెక్టులో సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించింది. ఈగలపెంట పోలీస్ స్టేషన్ లో తొలుత ఈ ప్రమాదంపై కేసు నమోదైంది. ఈ నెల 20వ తేదీ రాత్రి 10:05 నిమిషాలకు ప్రమాదం జరిగినట్టుగా ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు.ఈగలపెంట పోలీస్ స్టేషన్ నుండి కేసును సీఐడీకి బదిలీ చేశారు. 

also read:ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదు:శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదంపై సీఐడీ

శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో బ్యాటరీలు మార్చాలని రెండేళ్లుగా కోరుతున్నా కూడ పట్టించుకోలేదని ఇంజనీర్లు బహిరంగంగానే విమర్శలు చేశారు. రెండు రోజుల క్రితం శ్రీశైలం పవర్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదంలో మరణించిన ఇంజనీర్లకు సహచర ఉద్యోగులు సంతాప సభ నిర్వహించారు.

సంతాపసభలో కొందరు ఏఈలు బహిరంగంగానే ఉన్నతాధికారులపై విమర్శలు చేశారు. ఈ ప్రమాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. డబ్బులిచ్చిప్రాణాలు తీసుకొస్తారా.. అని కూడ ప్రశ్నించారు. ఈ ప్రమాదం ఎందుకు జరిగిందో అందరికీ తెలుసునంటూనే ఉన్నతాధికారుల వైపు ఏఈలు వేలేత్తి చూపారు.

పవర్ ప్లాంట్ లో బ్యాటరీలను మార్చేందుకు రూ. 3 కోట్లతో కాంట్రాక్టు కుదిరింది. అయితే ఈ కాంట్రాక్టు విషయంలో కమీషన్లకు కక్కుర్తి పడ్డారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. 

రెండేళ్లుగా బ్యాటరీలు మార్చాలని డిమాండ్ ఉన్నా కూడ ఎందుకు మార్చలేదని ప్రశ్నిస్తున్నారు. దీనికి కారణం ఏమిటని కూడ సీఐడీ దర్యాప్తు చేయనుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చిన సమయంలో విద్యుత్ ను ఉత్పత్తి చేస్తారు. జల విద్యుత్ ఉత్పత్తి చేయని సమయంలో పవర్ ప్లాంట్ లో మెయింటైన్స్ పనులు చేయాలి.
కానీ శ్రీశైలం ప్రాజెక్టుకు వరదలు వచ్చిన సమయంలో బ్యాటరీలు ఎందుకు మార్చాల్సి వచ్చిందో అనే కోణంలో కూడ సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

బ్యాటరీలు మార్చే సమయంలో న్యూకిలెన్స్ న్యూట్రల్ గా మారకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని విద్యుత్ శాఖ నిపుణులు చెబుతున్నారు. టర్బైన్ వేగం పెరగడం వల్ల ప్యానెల్ యూనిట్స్ లో షార్ట్ సర్క్యూట్ జరిగిందని నిపుణులు చెబుతున్నారు.