Asianet News TeluguAsianet News Telugu

ఎవరీ శంకర్ నాయక్ ?

  • ఇంజనీర్ ఉద్యోగం నుంచి రాజకీయాల్లోకి
  • కులాంతర వివాహం, భార్య డాక్టర్
  • 2009లో పిఆర్పీ నుంచి పోటీ, ఓటమి
  • 2014లో టిఆర్ఎస్ తీర్థం, గెలుపు
  • రాజకీయ జీవితమంతా వివాదమయమే
  • మెడకు చుట్టుకున్న కలెక్టర్ ప్రీతిమీనా  కేసు
who is this shankar naik

శంకర్ నాయక్... శంకర్ నాయక్... శంకర్ నాయక్... తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎవరినోట విన్నా శంకర్ నాయక్ పేరే వినబడుతున్నది. ఏ ఇద్దరు ముగ్గురు కలిసినా శంకర్ నాయక్ మీదనే చర్చలు నడుస్తున్నాయి. ఒక్క చిన్న సంఘటనతో శంకర్ నాయక్ తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయిండు. ఇంతకీ ఎవరీ శంకర్ నాయక్ ? ఆయన పుట్టు పూర్వోత్తరాలేంటి? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఈ సమాచారంతో ఏసియా నెట్ సమగ్ర కథనం అందిస్తున్నది.

 

మహబూబాబాద్ మారుమూల అటవీ ప్రాంతం. ఎప్పుడూ పెద్దగా వార్తల్లో లేని ప్రదేశం. గతంలో నక్సల్ కార్యకలాపాలు జోరుగా సాగిన ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి. కానీ గత కొంత కాలంగా నిశబ్ధమే ఆవహించింది. రాజకీయంగానూ పెద్దగా హడావిడి లేని ప్రాంతం. కానీ ఒక్కసారిగా ఇప్పుడు మహబూబాబాద్ బర్నింగ్ టాపిక్ అయింది. దానికి కారణం మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ప్రీతిమీనా చేయి పట్టుకోవడం. దీంతో ఆమె ఆగ్రహించింది. ఉన్నతాధికారులకు, సిఎం వరకు విషయం చేరింది. దీంతో సిఎం కెసిఆర్, డిప్యూటీ సిఎం కడియం శంకర్ నాయక్ ను ఘాటుగానే మందలించారు.

who is this shankar naik

శంకర్ నాయక్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి వివాదాస్పదమైన వ్యక్తిగానే ఎదిగారు. 2009 ఎన్నికల్లో ఆయన ప్రజారాజ్యం పార్టీ నుంచి టికెట్ తెచ్చుకుని మహబూబాబాద్ అసెంబ్లీ సీటుకు పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు కవిత మీద ఓడిపోయారు. సుమారు 18వేల ఓట్ల వరకు సాధించాడు శంకర్ నాయక్. అయితే అదే సమయంలో డిటి నాయక్ అనే అధికారి రాజకీయాల్లోకి వచ్చి పిఆర్పి తరుపున మహబూబాబాద్ పార్లమెంటుకు పోటీ చేశారు. డిటి నాయక్ కు శంకర్ నాయక్ బినామీ అన్న ప్రచారం అప్పట్లో బాగానే జరిగింది. ఎన్నికల తర్వాత మళ్లీ రియల్ ఎస్టేట్ సంపాదనలో మునిగిపోయిన శంకర్ నాయక్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

 

తీరా 2014 ఎన్నికలకు ఆరు నెలల ముందు టిఆర్ఎస్ నేతలతో సంబంధాలు పెంచుకుని టిఆర్ఎస్ లో చేరి టికెట్ మీద పోటీ చేసి ఎన్నికల్లో గెలిచాడు. 12వేల పైచిలుకు ఓట్లతో గెలిచాడు శంకర్ నాయక్. టిఆర్ఎస్ టికెట్ కోసం బాగానే ముడుపులు ముట్టచెప్పినట్లు ఆరోపణలూ వచ్చాయి అప్పట్లో. గెలిచిన తర్వాత మూడేళ్ల కాలంలో అధికారులు మొదలుకొని పార్టీ శ్రేణుల వరకు ఎవరితోనూ సఖ్యంగా ఉన్న దాఖలాలు లేవని పలువురు బహిరంగంగానే చెబుతున్నారు. తను అనుకున్నది మొహం మీదనే చెప్పేవాడని అంటుంటారు. ఇటీవల కాలంలో ఒక మహిళా ఎమ్మార్వోనూ దుర్భాషలాడినట్లు చెబుతున్నారు. మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతిమీనా ను గత కొంతకాలంగా వేధిస్తున్నట్లు శంకర్ నాయక్ మీద ఆమె స్వయంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. నాలుగైదు సందర్భాల్లో ప్రీతిమీనాతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆమె ఐఎఎస్ అధికారుల సంఘానికి నివేదించినట్లు సమాచారం. ఇక భరించచలేక ఆమె ఓపెన్ అయిందని అంటున్నారు.

who is this shankar naik

శంకర్ నాయక్ కలెక్టర్ మీనాకు భేషరతు క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఆయనపై కేసులు నమోదు చేయడం, అరెస్టు చేసి వదిలేయడం వంటివి చూస్తుంటే కేవలం ఈ ఒక్క విషయంలోనే కాకుండా పైనుంచి ఆదేశాలు వస్తున్నాయని తెలుస్తోంది. దానికి శంకర్ నాయక్ మీద పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో మియాపూర్ భూముల వ్యవహారంలో కొందరు పేర్లు బయటకొచ్చినప్పుడు శంకర్ నాయక్ నోరు జారినట్లు చెబుతున్నారు. రకరకాల కేసులు ఉన్న వారు, అవినీతి ఆరోపణలు ఉన్నవారే  రక్షణ కోసం అధికార పార్టీ టిఆర్ఎస్ లో చేరుతున్నారని శంకర్ నాయక్ ఆరోపించారు. ఒకవైపు బంగారు తెలంగాణ కోసం సిఎం కెసిఆర్ ఇతర పార్టీల నుంచి నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తుంటే మరోవైపు శంకర్ నాయక్ ఉల్టా మాట్లాడడం పట్ల సిఎం ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు. 

 

శంకర్ నాయక్ సొంత నియోజకవర్గం పాలకుర్తి. కానీ ఎస్టీ రిజర్వుడు సీటు కావడంతో ఆయన మహబూబాబాద్ సీటులో పోటీ చేసినట్లు చెబుతన్నారు. శంకర్ నాయక్ వరంగల్ లోని నిట్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 1985 నుంచి 1990 వరకు రీజినల్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఆర్ఎస్ యు కీలక నేతగా పనిచేశారు. ఇరిగేషన్ శాఖలో ఇఇ స్థాయిలో పనిచేశారు. ఒకసారి ఎసిబి రైడ్స్ కూడా ఆయనపై జరిగినట్లు తెలుస్తోంది. ఆయన కులాంతర వివాహం చేసుకున్నారు. డాక్టర్ అయిన సీతామహాలక్ష్మి (బిసి రజక) తో వివాహం జరిగింది. ఆమె ప్రస్తుతం ఎంజిఎం లో పనిచేస్తున్నారు. ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. కూతురు నిట్ లోనే బిటెక్ చదువుతుండగా, కొడుకు ఇంటర్ చదువుతున్నాడు.

who is this shankar naik

కలెక్టర్ తో వివాదం విషయంలో శంకర్ నాయక్ చెబుతున్న తీరు మరో రకంగా ఉంది. కలెక్టర్ తో తాను ఏనాడూ  అసభ్యంగా ప్రవర్తించలేదని శంకర్ నాయక్ అంటున్నాడు. పలు సందర్భాల్లో ఆమెకు తనకు పాలనాపరంగా అభిప్రాయబేధాలు వచ్చాయి తప్ప అసభ్యంగా ప్రవర్తించిన మాటలో వాస్తవం లేదంటున్నాడు. తను, తన భార్య ఉన్నత విద్య చదువుకున్నామని, సమాజానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి  వచ్చిన తాను కలెక్టర్ పట్ల ఎలా అసభ్యంగా ప్రవర్తిస్తానని ప్రశ్నిస్తున్నారు శంకర్. అయినా పబ్లిక్ మీటింగ్ లో తనపై ఆరోపణలు రావడం వెనుక ఏదో కుట్ర ఉందంటున్నాడు. అనేక మంది ప్రజాప్రతినిధులు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, బయటి వాళ్లతో అసభ్యంగా ప్రవర్తిస్తూ దొరికిపోయిన సందర్భాలున్న రోజుల్లో తాను ఏనాడైనా ఎవరితోనైనా అసభ్యంగా ప్రవర్తించినట్లు ఒక్క ఆరోపణ అయినా వచ్చిందా అని శంకర్ నాయక్ ప్రశ్నిస్తున్నారు.

పోడు భూముల విషయం లో ఇద్దరి మధ్య వివాదం నెలకొందని చెబుతున్నాడు.

గతంలో కస్తూర్బా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయిన సందర్భంలో తాను విద్యార్థుల తరుపున మాట్లాడితే కలెక్టర్ సూపరింటెండెంట్ ను వెనుకేసుకు వచ్చిందని అప్పుడు ఇద్దరి మధ్య వివాదం ఉందంటున్నారు.

మహబూబాబాద్ లో ఎస్టీ హాస్టల్ తరలింపు విషయంలో ఇద్దరి ధ్య వివాదం ఉందంటున్నారు. హాస్టల్ తరలించొదన్ని తాను డిమాండ్ చేసినట్లు చెబుతున్నాడు.

సాలార్ తండా భూముల వివాదం ఎమ్మెల్యే గిరిజనుల వైపు నిలవగా కలెక్టర్ గిరిజనులకు వ్యతిరేకంగా పనిచేశారని అంటున్నారు. అభివుద్ధి పనుల కోసం ఇప్పటి వరకు కలెక్టర్ ను ముడు, నాలుగు సార్లే కలిశానని శంకర్ నాయక్ అంటున్నాడు.

who is this shankar naik

మొత్తానికి ఉన్నత  విద్య చదివి రాజకీయాల్లోకి వచ్చి అనతికాలంలోనే ఎమ్మెల్యేగా ఎదిగిన శంకర్ నాయక్ మరెంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న నాయకుడు. కానీ వివాదాలు చుట్టుముట్టి రాజకీయ జీవితం ప్రశ్నార్థకంగా మారిన సమయం ఇది. ఆయన ముక్కుసూటితనం, మొహం మీద చెప్పడం, కఠినంగా మాట్లాడడం లాంటి లక్షణాల వల్ల శంకర్ నాయక్ అగాధంలోకి పడిపోయాడని అంటున్నారు. గిరిజన కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగిన శంకర్ నాయక్ రాజకీయాల్లో ఉన్నప్పటికీ నిజమైన రాజకీయాలు వంటబట్టలేదని, అందుకే వివాదాల్లో చిక్కుకున్నారని చెబుతున్నారు.

 

రానున్న ఎన్నికల్లో శంకర్ నాయక్ కు టికెట్ ఇవ్వకుండా మాజీ మంత్రి రెడ్యానాయక్ కూతురు కవితకు టికెట్ ఇచే ఉద్దేశంతోనే ఆయనపై బురద చల్లుతున్నారన్న ప్రచారం శంకర్ నాయక్ మనుషులు చేపడుతున్నారు. దానికితోడు టిఆర్ఎస్  లో చేరేవారి విషయంలో శంకర్ చేసిన కామెంట్లు సిఎం ఆగ్రహానికి కారణమయ్యాయని అంటున్నారు. మొత్తానికి అనతికాలంలోనే వివాదాల సుడిగుండంలో శంకర్ నాయక్ చిక్కుకుపోవడం చూస్తే ఇక ఆయన రానున్న రోజుల్లో రాజకీయాల్లో కొనసాగుతారా లేదా అన్నది అనుమానాస్పంగా మారింది. లౌక్యం తెలియని రాజకీయ నాయకుల జాబితాలో శంకర్ నాయక్ కూడా చేరిపోయారని రాజకీయ పండితులు అంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios