ఈ నెలలో ముగయనున్న రాజీవ్ శర్మ పదవీకాలం రేసులో నలుగురు సీనియర్ ఐఏఎస్ లు

తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ త్వరలోనే పదవీ విరమణ చేయనున్నారు. ఈ నెలాఖరునే ఆయన పదవీ విరమణ ఉంది. దీంతో ఆయన స్థానంలో ఎవరు సీఎస్ గా బాధ్యతలు చేపడుతారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

వాస్తవానికి గత మే నెలాఖరున రాజీవ్‌శర్మ పదవీ కాలం ముగిసింది. సీఎం కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి మేరకు కేంద్రం మూడు నెలల చొప్పున వరుసగా రెండు సార్లు సీఎస్ పదవీ కాలాన్ని పొడిగించింది. మరోసారి పదవీ కాలం పొడిగించే అవకాశం లేదు. దీంతో రాజీవ్ శర్మ రిటైర్‌మెంట్‌కు సంబంధించిన ఫైలు సిద్ధమైంది.

ఇక కొత్త సీఎస్‌గా ఎవరికి అవకాశమిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతులు పొందిన ఐఏఎస్‌ల జాబితాలో 8 మంది అధికారులున్నారు. వీరిలో సీనియర్ ఐఏఎస్ ప్రదీప్ చంద్ర, ఎస్‌పీ సింగ్, ఎస్‌కే జోషిల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సీఎం తన విచక్షణాధికారం మేరకు సీనియర్ ఐఏఎస్‌లలో ఒకరిని సీఎస్‌గా నియమించుకునే అవకాశం ఉంది. దీంతో కేసీఆర్ ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తి గా మారింది.


1982 బ్యాచ్‌కు చెందిన ప్రదీప్ చంద్ర జాబితాలో ముందు వరుసలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన రెవిన్యూ శాఖ స్పెషల్ సీఎస్‌. కానీ డిసెంబర్ లోనే ఆయన రిటైరవనున్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో అనుభవమున్న రాజీవ్ శర్మను కొనసాగించేందుకు సీఎం మొగ్గు చూపారు. ఇదే విధంగా ఇప్పడు

ప్రదీప్ చంద్రను తదుపరి సీఎస్‌గా నియమించి అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజీవ్ శర్మ తరహాలో ఆయన పదవీకాలాన్ని పొడిగిం చేందుకు కేంద్రం అనుమతి కోరే అవకాశాలు లేకపోలేదనే చర్చ జరుగుతోంది.

ప్రదీప్ చంద్రకు అవకాశం దక్కని పక్షంలో.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ ఎస్పీ సింగ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. మిషన్ భగీరథ కార్యక్రమాన్ని విజయవంతం చేయటంతోపాటు నాబార్డు, వివిధ రుణాలను తెచ్చేందుకు ఆయన క్రియాశీల పాత్ర పోషించారనే పేరుంది. మరోవైపు ఇదే బ్యాచ్‌కు చెందిన ఎంజీ గోపాల్, బినయ్ కుమార్, వీకే అగర్వాల్, రంజీవ్ ఆర్ ఆచార్య స్పెషల్ సీఎస్ హోదాలో ఉన్నారు. వీరందరూ సీఎస్ పదవికి అర్హులు కావటంతో ఎవరికి అవకాశం దక్కుతుందనేదిచర్చనీయాంశంగా మారింది.

మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్, ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ డెరైక్టర్ జనరల్ వీకే అగర్వాల్ పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగియనుంది. ప్రస్తుతం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ డీజీగా డిప్యుటేషన్‌పై ఢిల్లీలో ఉన్న బినయ్ కుమార్, వ్యక్తిగత కారణాల వల్ల తాను రాష్ట్రానికి రావడానికి సిద్ధంగా లేనని ఇప్పటికే ప్రభుత్వానికి సంకేతాలు పంపించినట్లు తెలిసింది. వీరి తర్వాత 1984 బ్యాచ్‌లో ఎస్‌కే జోషి, అజయ్ మిశ్రా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా ఉన్నారు. సీఎం అత్యంత ప్రాధాన్యమిస్తున్న నీటిపారుదల శాఖకు ఎస్‌కే జోషి స్పెషల్ సీఎస్‌గా ఉన్నారు. సీఎస్ రేసులో ఉన్న వారిలో ఆయన పేరు కూడా ప్రముఖంగానే వినిపిస్తోంది.