Asianet News TeluguAsianet News Telugu

ఎవరీ తెలంగాణ పుష్పారెడ్డి ?

  • మంత్రి జగదీష్ రెడ్డికి దగ్గరి బంధువు
  • బేడీలేయించడం పై సర్వత్రా విమర్శలు
  • కోమటిరెడ్డి పై దాడిలో కీలక సూత్రదారిగా ఆరోపణలు
  • జిల్లా రాజకీయాల్లో పాగా వేసేందుకు యత్నాలు
who is kunta puspa reddy

తెలంగాణలోని నల్లగొండ జిల్లా, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం భార్య కుంట పుష్పారెడ్డి అలియాస్ పుష్ప వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. కవి, గాయకుడు ఏపూరి సోమన్నతో సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పోలీసు స్టేషన్ లో వాగ్వాదానికి దిగారు కుంట పుష్పారెడ్డి. దీంతో ఆమె సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. ఈ సమయంలో తన అనుచరుల చేత వీడియో తీయించి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయించారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అయింది. దీంతో ఎవరీ ఎమ్మెల్యే సతీమణి? ఎవరీ కుంట పుష్పారెడ్డి అని జనాల్లో చర్చలు జోరందుకున్నాయి.

కుంట పుష్ప సొంత గ్రామం కోటమర్తి. మోత్కూరు మండలంలో ఉంది. ఈ గ్రామం ప్రస్తుతం యాదాద్రి జిల్లాలో ఉంది. ఆమె తండ్రి కుంట భిక్షం రెడ్డి. ఆయన జనశక్తి పార్టీ నాయకుడిగా పనిచేశారు. తండ్రి ప్రభావంతో కుంట పుష్ప చిన్నప్పటినుంచే కళాకారిణిగా పాటలు పాడుతూ ప్రశంసలు పొందారు. జనశక్తి పార్టీ అనుబంధ విభాగమైన అరుణోదయ కళాకారుల సంఘంలో కీలక కార్యకర్తగా పనిచేశారు. ఈ క్రమంలోనే అదే పార్టీకి చెందిన నాయకుడు వేముల వీరేశంతో ఉన్న స్నేహం, సాన్నిహిత్యం కారణంగా వీరేశం ను వివాహం చేసుకున్నారు.

ప్రస్తుతం తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డికి కోట పుష్ప దగ్గరి బంధువు. దీంతో  ఆమె తాజా రాజకీయాల్లో పుష్ప కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డి అండదండలతోనే ఆమె తిరుమలగిరి పోలీసు స్టేసన్ లో హల్ చల్ చేశారని బాధితుడు సోమన్న దోస్తులు చెబుతున్నారు. ఆమె స్వయంగా స్టేషన్ కు  వెళ్లి తీవ్రమైన ఒత్తిడి చేయడం వల్లనే పోలీసులు సోమన్నకు ఉక్కు సంకెళ్లు వేసి లాకప్ ముందు కట్టేశారని ఆరోపిస్తున్నారు. ఆమె అనుచరులే వీడియోలు తీసి సోషల్ మీడియలో పోస్టు చేశారని చెబుతున్నారు.

గత మూడేళ్లుగా పుష్ప నకిరేకల్ నియోజకవర్గ రాజకీయాల్లో భర్త వీరేశంతోపాటు ఆమె కూడా యాక్టీవ్ రోల్ పోశిస్తున్నారు. నియోజకవర్గంలోని కష్ట నష్టాలున్నవారు వచ్చి ఆమెను నేరుగా కలిసి తమ గోడు చెప్పుకుంటారు. వారి సమస్య పరిష్కారానికి ఆమె తనవంతు చేతనైన సాయం చేస్తుంటారని స్థానికులు చెప్పుకుంటున్నారు. మహిళల సమస్యలు, వరకట్న వేధింపులు, ఇతరత్రా మహిళా సంబంధ అంశాలపై ఆమె నిరంతరం పనిచేస్తారని టిఆర్ఎస్ కార్యకర్తలు చెబుతున్నారు.

ఇక కుంట పుష్ప జిల్లా వ్యాప్తంగా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొని హల్ చల్ చేస్తున్నారు. ఇటీవల నల్లగొండలో బత్తాయి మార్కెట్ ఓపెనింగ్ లో పెద్ద హడావిడి చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావుతోపాటు నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా హాజరయ్యరు. ఈ సందర్భంగా కోమటిరెడ్డిపై స్వల్ప దాడి జరిగింది. ఆ దాడికి సూత్రదారి కుంట పుష్ప అని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విమర్శించారు. సిఎల్పీ నేత జానారెడ్డి స్వయంగా ఈ దాడికి కారణం నకిరేకల్ ఎమ్మెల్యే సతీమణి కుంట పుష్ప అని ఓపెన్ కామెంట్ చేశారు. ఆమె రెచ్చగొట్టడం వల్లనే కోమటిరెడ్డిపై దాడి జరిగిందని జానారెడ్డి వ్యాఖ్యానించారు.  దీన్నబట్టి జిల్లా రాజకీయాల్లో కుంట పుష్పారెడ్డి కీలక వ్యక్తిగా ఎదిగేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

ఏది ఏమైనా కుంట పుష్పారెడ్డి ఏపూరి సోమన్నకు బేడీల విషయంలో చర్చనీయాంశం కావడం ఒక ఎత్తైతే అంతే స్థాయిలో ఆమె ఎందుకు అలా వ్యవహరించిందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios