తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ అవమానిస్తే.. ఇక్కడి రైతులు వరి వేయాలని రెచ్చగొట్టిన బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.
హైదరాబాద్: తెలంగాణలో పండిన వరి ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్‌లో నిరసన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యపు ధోరణిని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలన్న టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మంత్రి నిజామాబాద్ బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలో నిరసన చేపట్టారు. రైతులు, పార్టీ కార్యకర్తలు భారీగా హాజరైన ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కేంద్రాన్ని విమర్శించారు. తెలంగాణ పచ్చబడుతుంటే కేంద్రం ఓర్వలేకపోతున్నదని అన్నారు.
తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా కొనాల్సిందేనని ఈ కార్యక్రమంలో రైతులు, పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ నిరసన సభా ప్రాంగణలో ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. పలు సందర్భాల్లో వరి వేయాలని బీజేపీ నేతలు రైతులకు పిలుపు ఇచ్చిన వీడియో క్లిప్‌లను ప్లే చేశారు. వీటిని చూసిన తర్వాత రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు బీజేపీ నాయకులను వదిలే ప్రసక్తే లేదని ఆగ్రహించారు. తమ ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోతే బీజేపీ నేతల ఇళ్ల ముందు పారబోస్తామని హెచ్చరించారు.
తెలంగాణపై కేంద్రం కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నదని మంత్రి వేముల ఆరోపించారు. తెలంగాణ పచ్చబడితే వాళ్లు ఓర్వలేకపోతున్నారని వివరించారు. తెలంగాణ రైతుల ఉన్నతికి కేసీఆర్ అనేక మార్గాల్లో దోహదపడ్డారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి పంట పారకానికి సాగు నీటిని, 24 గంటల ఉచిత విద్యుత్, పెట్టుబడి సాయం, రైతు బీమా వంటి అనేక అద్భుత పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలేవీ.. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు అమలు చేయడం లేదని తెలిపారు. అందుకే బీజేపీకి పుట్టగతులు మిగిలే పరిస్థితులు ఉండవని వారు భయపడుతున్నారని చెప్పారు. అందుకే వారికి భయం పట్టుకున్నదని అన్నారు. కాబట్టి, తెలంగాణపై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీజేపీవి అన్నీ అబద్ధాలే అని పేర్కొన్నారు. కరెంట్ కోసం 10 వేల కోట్లు, రైతు బంధు కోసం 14 వేల కోట్లు, రైతు బీమా కోసం 3700 కోట్లు ప్రతి యేటా కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని అన్నారు.
కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని, పంట దిగుబడి కూడా పెరిగిందని వివరించారు. కానీ, రెండేళ్లుగా మోడీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి ఆటంకం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నదని తెలిపారు.
తెలంగాణ ధాన్యాన్ని కొనాలని తాము కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌ను కలిస్తే తెలంగాణ సమాజాన్ని అవమానించారని అన్నారు. వడ్లు కొనబోమని ఆ కేంద్ర మంత్రి తెగేసి చెప్పారని వివరించారు. పైగా తెలంగాణ ప్రజలు నూకలు తినాలని అవమానించేలా మాట్లాడారని చెప్పారు. ఆ వ్యాఖ్యలు తమలో తీవ్ర కలత రేపాయని తెలిపారు. తమను వంద మాటలు అన్నా పడతాం.. కానీ మా తెలంగాణ సమాజాన్ని అంటే అస్సలు ఊర్కోమన్నాం అని స్పష్టం చేశామని వివరించారు.
ఇంతటి మాటలు కేంద్ర మంత్రులు అంటూ ఉంటే.. ఇక్కడి బీజేపీ నేతలు సిగ్గు లేకుండా ఢిల్లీ బీజేపీ సంకలో చేరి వారి మాటలకు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఇప్పుడే ఇవ్వలేమని అప్పుడు సోనియా గాంధీ అన్నందుకు కేసీఆర్ వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు. అదీ తెలంగాణ పౌరుషం అంటే అని తెలిపారు. కేంద్ర మంత్రి కండకావరంతో తెలంగాణ ప్రజలు నూకలు తినాలని అవమానిస్తే.. ఇక్కడి బీజేపీ నేతలు ఎందుకు సప్పుడు చేయట్లేదని ప్రశ్నించారు. తెలంగాణ రైతులను రెచ్చగొట్టి మరీ వరి వేయించిన బండి సంజయ్, కిషణ్ రెడ్డిలు ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. కేంద్రం మెడలు వంచైనా తెలంగాణ ధాన్యం కొనిపిస్తామని మంత్రి స్పష్టం చేశారు. అప్పటి వరకు బీజేపీ నేతలను ఎక్కడికక్కడ నిలదీస్తామని వార్నింగ్ ఇచ్చారు.
