ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర, దక్షిణ తెలంగాణ అన్న తేడా లేకుండా రాష్ట్రవ్యాప్తంగా కారు దూసుకెళ్లింది. కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులు మాత్రం కారు స్పీడుకు బ్రేకులు వేశారు. జిల్లాలోని మొత్తం 10 స్థానాలకు గాను టీఆర్ఎస్ ఒక్క స్థానంలో మాత్రమే గెలవడంతో కేసీఆర్‌కి తల కొట్టేసినట్లయ్యింది.

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితం తేడా కొడుతుందని భావించిన గులాబీ దళపతి ఖమ్మం లోక్‌సభ సెగ్మెంట్‌లోని కీలక నేతలను కారెక్కించేందుకు స్కెచ్ గీశారు. ఇప్పటికే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేని ఆకర్షించిన కేసీఆర్.. ప్రధానంగా టీడీపీ ఎమ్మెల్యేలపై ఫోకస్ పెట్టారు.

సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పార్టీలోకి వస్తున్నట్లు ప్రకటించి. అనూహ్యంగా చివరి నిమిషంలో నిర్ణయాన్ని మార్చుకున్నారు. అలాగే అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మొదట టీఆర్ఎస్‌లో చేరనని ప్రకటించిన ఆయన కారువైపే మొగ్గుచూపుతున్నట్లుగా తెలుస్తోంది.

ఈ నెల 17వ తేదీలోపే కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకుల అంచనా. మరోవైపు అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటే ఎవరి నేతృత్వంలో చేరుతారోనని జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

వైరా నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచిన రాములు నాయక్ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఇది జరిగిన తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేరేలా చేయాలని కేసీఆర్ ఆదేశించడంతో సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావుతో పొంగులేటి వర్గీయులు చర్చలు జరిపారు.

గులాబీ కండువా కప్పుకునేందుకు సండ్ర దాదాపుగా రెడీ అయినప్పటికీ.. మెచ్చా మాత్రం సంశయిస్తున్నట్లుగా తెలుస్తోంది. వెంకటవీరయ్యతో కలిసి వెలితే ఆయనకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని, తనకు ప్రాధాన్యం ఉండదని మెచ్చా ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో మెచ్చాకు ప్రాధాన్యత కల్పించేలా నామినేటెడ్ పదవి ఇచ్చేందుకు టీఆర్ఎస్ అధిష్టానం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 8న మెచ్చా మంత్రి తుమ్మలను కలిశారు.

అయితే ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేవలం మర్యాదపూర్వకంగానే తుమ్మలను కలిశానని, ఎలాంటి రాజకీయ అంశాలకు సంబంధించి చర్చలు జరగలేదని మెచ్చా మీడియాకు తెలిపారు. మరోవైపు సండ్రతో పాటు మెచ్చా టీఆర్ఎస్‌లో చేరే అవకాశాలు ఉండటంతో టీడీపీ అధిష్టానం నష్టనివారణా చర్యలు చేపట్టింది.

ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. మెచ్చాను అమరావతికి పిలుపించుకుని మాట్లాడారు. ప్రలోభాలకు తలొగ్గి ఎట్టి పరిస్ధితుల్లోనూ టీఆర్ఎస్‌లోకి చేరవద్దని సూచించారు. సండ్ర వెళ్లినా మెచ్చాను మాత్రం వెళ్లవద్దని కోరినట్లు సమాచారం.

టీడీపీలో కొనసాగితే టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారట. అలాగే మెచ్చాకు ఓ ఖరీదైన కారు బహుకరించినట్లు అశ్వారావుపేటలో ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద ఈ పరిణామాలు గులాబీ దళాన్ని టెన్షన్ పెడుతున్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి వ్యవహారం తేలితే.. వీలైనంత త్వరలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.