తన గొప్ప చూపించుకోవడానికి ఓ తల్లి చేసిన పని కొడుకును జైలు పాలు చేసింది. విషయం ఏంటంటే నెక్లెస్ వేసుకుని దిగిన తన ఫోటోను ఓ మహిళ వాట్సప్ స్టేటస్ గా పెట్టింది. అది చూసిన పక్కింటివాళ్లు తమింట్లో పోయిన నగ అదేనని ఫిర్యాదు చేయడంతో.. అది దొంగిలించిన కొడుకుతో పాటు.. తల్లినీ పోలీసులు అరెస్ట్ చేశారు.

2019, జూలై 12న సాయి​కిరణ్‌ అనే వ్యక్తి గుడికి వెళ్లి, ఇంటికి వచ్చేసరికి అతని ఇంటితలుపులు తెరచి ఉన్నాయి. తాళం వేయడం మర్చిపోయానేమో అనుకుంటు లోపలికి వెళ్లిన ఆ వ్యక్తి తన ఇంట్లో బంగారం పోయినట్టు తెలుసుకున్నాడు. దీంతో ఇంట్లో చోరి జరిగిందని రాచకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఎంత దర్యాప్తు చేసినా కేసు సాల్వ్ చేయలేకపోయారు. 

ఇక ఇన్ని రోజుల తరువాత వాళ్ల ఇంటి పక్కన ఉండే మహిళ కిరణ్‌ వాళ్ల ఇంట్లో దొంగిలించిన నగను పెట్టుకొని ఉన్న ఫోటోను తన వాట్సాప్‌ స్టేటస్ గా పెట్టుకుంది. చూసిన కిరణ్‌ అది తమ ఇంట్లో పోయిన నగగా గుర్తించి.. ఆ విషయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేయగా ఆమె కొడుకు జితేందర్‌ ఈ దొంగతనానికి పాల్పడినట్లు తెలిసింది. ఈ విషయం అతని తల్లి తెలిసే జరిగిందని పోలీసులు ఆమెకు కూడా నోటీసులు జారిచేశారు.