తెలంగాణలో ఉద్యోగాల భర్తీలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తుస్సుమంటున్నదా? నియామకాలు చేపట్టడంలో టిఎస్పిఎస్సీ ఘోరంగా విఫలమవుతోందా? తెలంగాణ సర్కారే టిఎస్పిఎస్సీ జాబ్ రిక్రూట్ మెంట్ ను నమ్మలేకపోతున్నదా? టిఎస్పిఎస్సీని కాదని వైద్యఆరోగ్య శాఖ సొంతంగానే కాంట్రాక్టు పద్ధతిలో జాబ్ రిక్రూట్ మెంట్ కు రంగం సిద్ధం చేసుకోవడం చూస్తే ఈ అనుమానాలు నిజమే అనిపిస్తోంది.

యుపిపిఎస్సీని తలదన్నే రీతిలో తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ పనిచేస్తదని ముందుగా చాలా గొప్పగా  ప్రకటించారు. దేశంలోనే నెంబర్ వన్ సర్వీస్ కమిషన్ గా మారుస్తామని హామీలు దంచిర్రు. గొప్ప ప్రొఫెసర్ అయిన ఘంటా చక్రపాణి  కి ఛైర్మన్ బాధ్యతలు అప్పగించడంతో తమ దశ తిరుగుడు ఖాయమని నిరుద్యోగులు సంబరపడ్డారు. కానీ ఆచరణలో మాత్రం కంప్లీట్ ఉల్టా అయింది.

దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉండుడు కాదుగదా? తెలంగాణలో నిరుద్యోగ యువత విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయింది టిఎస్పిఎస్సీ. ఈ ముచ్చట ఇప్పుడే కాదు ఎప్పటినుంచో నిరుద్యోగులు చెబుతున్నారు. కానీ టిఎస్పిఎస్సీ పనితీరులో మార్పు రావడంలేదు. కారణాలేమైనా... ప్రభుత్వ సహకారం ఉందా లేదా? అనేది పక్కన పెడితే సర్వీస్ కమిషన్ ప్రతిష్ట మాత్రం రోజురోజుకూ మసకబారుతూనే ఉన్నది.

తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఒక కీలక ప్రకటన చేశారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో 2100 పోస్టులను భర్తీ చేయాలంటూ టిఎస్పిఎస్సీకి వివరాలు పంపినాము... కానీ వారి రిక్రూట్ మెంట్ ప్రాసెస్ ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున అంతమందం పోస్టులను మేమే కాంట్రాక్ట్ పద్ధతిలో చేపడతాము అని మంత్రి లక్ష్మారెడ్డి ప్రకటన వెలువరించారు. ఆయన వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష జరిపిన తర్వాత వెల్లడైన అంశం ఇది. ఈ పరిణామంతో టిఎస్పిఎస్సీ అలసత్వం అనేది వైద్య ఆరోగ్య శాఖ చెప్పకనే చెప్పినట్లైంది.

నిజానికి వైద్య ఆరోగ్య శాఖ సొంత నిర్ణయమే అయినప్పటికీ ఇన్ డైరెక్ట్ గా టిఎస్పిఎస్సీని బదనాం చేస్తుందన్న అనుమానాలు సైతం ఏర్పడుతున్నాయి. ఎందుకంటే గడిచిన మూడేళ్లపాటు సైలెంట్ గా ఉండి ఉన్నఫలంగా కాంట్రాక్ట్ పద్ధతిలో తాము 2100 పోస్టులు భర్తీ చేస్తాం... టిఎస్పిఎస్సీ ఉద్యోగాల భర్తీ ఆలస్యమైపోతుందని ఆందోళన వ్యక్తం చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. నిజంగా అంత అర్జెంట్ పోస్టులైతే... ఈ మూడేళ్ల కాలంలో వైద్య ఆరోగ్య శాఖ చేసిన ఎఫర్ట్ ఏమిటో కూడా తెలియాల్సి ఉంది. అది కాకుండా టిఎస్ పిఎస్సీని వత్తిడి చేసి త్వరగా ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరవచ్చు. కానీ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీ చేపట్టే ఉద్దేశంతోనే సర్వీస్ కమిషన్ మీద ఒక రాయి వేసి సొంత రిక్రూట్ మెంట్ కు రంగం సిద్ధం చేసుకున్నారన్న వాదన కూడా ఉంది.

ఇక టిఎస్పిఎస్సీ అవగాహనా రాహిత్యం కావొచ్చు, ఇంకేమైనా కావొచ్చు కానీ ప్రతి నోటిఫికేషన్ కోర్టుల్లో నలిగింది. నిరుద్యోగులు ఉసూరుమన్నారు. తెలంగాణ రాగానే వేలకు వేలు ఉద్యోగాలొస్తాయి అని గంపెడాశతో ఉన్న నిరుద్యోగ యువత నైరాశ్యంలో కొట్టు మిట్టాడుతోంది.  ఈ పరిస్థితుల్లో టిఎస్ పిఎస్సీని కాదని వైద్య ఆరోగ్య శాఖ సొంతంగానే ఉద్యోగాల భర్తీ అదీ కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో జరుపుకోవాలని చూడడం వివాదాస్పదమవుతోంది. పరిస్థితి చూస్తే ఈ 2100 ఉద్యోగాల భర్తీ ఇక టిఎస్పిఎస్సీ ద్వారా జరగదేమోనన్న ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది. ఎందుకంటే ఉద్యోగాలు ఉద్యోగాలు అంటూ మూడేళ్లు గడిపి తీరా మూడేళ్ల తర్వాత కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ మెంట్ అంటున్నారు కాబట్టి ఈ విధంగా భర్తీ చేసిన వారిని తీసేసే పరిస్థితి ఉండదు. సో ఆ పోస్టులన్నీ శాశ్వత ప్రాతిపదికన భర్తీ అనేది మరచిపోవాల్సిందే అని ఒక నిరుద్యోగ యువకుడు ఏషియా నెట్ తో తన ఆవేదన వెల్లడించారు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/bvNpCW