Asianet News TeluguAsianet News Telugu

బీఆర్ఎస్ విస్తరణ లేనట్లేనా.. ప్రస్తుతానికి తెలంగాణకే పరిమితమా , నిన్నటి మీటింగ్‌లో ఎంపీలకు కేసీఆర్ ఎం చెప్పారు

తెలంగాణలో తమకు ఎదురే లేదని భావించిన భారత్ రాష్ట్ర సమితికి (బీఆర్ఎస్) ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు బ్రేకులు వేశాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణకే పరిమితం కావాలని, ఎంఐఎం మద్ధతుతో 12 నుంచి 15 స్థానాల్లో విజయం సాధించాలని కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లుగా కథనాలు వస్తున్నాయి

what is the strategy for KCR On BRS Party Expansion ksp
Author
First Published Jan 27, 2024, 4:15 PM IST | Last Updated Jan 27, 2024, 4:15 PM IST

తెలంగాణలో తమకు ఎదురే లేదని భావించిన భారత్ రాష్ట్ర సమితికి (బీఆర్ఎస్) ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు బ్రేకులు వేశాయి. తెలంగాణ ఇచ్చిన వ్యక్తిగా కేసీఆర్‌కు, పార్టీగా బీఆర్ఎస్‌కు రాష్ట్ర ప్రజలు పదేళ్ల పాటు మద్ధతుగా నిలిచారు. అయితే ఈసారి మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. ప్రజలు కేసీఆర్ పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టి.. కాంగ్రెస్‌పై పోరాడాలని తీర్పుచెప్పారు. ఓటమిని జీర్ణించుకోలేని గులాబీ శ్రేణులు ఇంకా కోలుకోలేకపోయాయి. సరిగ్గా అదే సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కాలు జారిపడటం, తుంటి ఎముక విరిగి సర్జరీ జరగడంతో ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు. దీంతో పార్టీని కేటీఆర్ నడిపిస్తూ, పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సన్నాహాక సమావేశాలు నిర్వహిస్తున్నారు. 

కేసీఆర్ కోలుకుని తిరిగి పగ్గాలు అందుకుంటే తప్పించి బీఆర్ఎస్‌లో పాత జోష్ కనిపించదు. కేడర్ కూడా అదే కోరుకుంటూ సోషల్ మీడియాలో సైతం ఇదే పోస్టులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. తాను త్వరలోనే ప్రజల్లోకి వస్తానని కేసీఆర్ ఎంపీలకు తెలిపారు. ఎన్నికల్లో ఏ విధంగా పోరు సాగిద్దామనే విషయమై ఆయన ఈ భేటీ ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ అనుకూల, ప్రతికూల పరిస్ధితులను కూడా కేసీఆర్ ఆరా తీశారు. 

అంతా బాగానే వుంది కానీ.. తెలంగాణ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ విస్తరణ ప్రణాళికలకు సైతం బ్రేకులు పడినట్లే కనిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నాటికి నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ కూటమిని ఏర్పాటు చేసి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ ఆశించారు. ఇందుకోసం టీఆర్ఎస్ పార్టీని కాస్తా బీఆర్ఎస్‌గా మార్చారు. దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రాంతీయ పార్టీల నేతలను వరుసపెట్టి కలిశారు. మహారాష్ట్రపై ఫోకస్ పెట్టి పార్టీ కమిటీలు సైతం వేశారు. తెలంగాణ ఎన్నికలకు ముందు దాదాపు 600 కార్లతో ర్యాలీగా షోలాపూర్ వెళ్లి హల్ చల్ చేశారు గులాబీ దళపతి. 

అయితే కేసీఆర్ జోరుకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అడ్డుకట్ట వేశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి, తనకు అనారోగ్యం, కేంద్రంలో బీజేపీ బలంగా వుండటం వంటి కారణాలతో చంద్రశేఖర్ రావు .. బీఆర్ఎస్ విస్తరణ ప్రణాళికలను నిలిపివేసినట్లుగా సమాచారం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణకే పరిమితం కావాలని, ఎంఐఎం మద్ధతుతో 12 నుంచి 15 స్థానాల్లో విజయం సాధించాలని కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లుగా కథనాలు వస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ధీటుగా వ్యూహాలు, హామీలు ప్రకటించాలని చంద్రశేఖర్ రావు సూచించారు. అయోధ్య రామమందిరం, హిందుత్వ ఎజెండాతో జోష‌తో వున్న బీజేపీకి, తెలంగాణలో పదేళ్ల తర్వాత గెలిచిన కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. మరి ఆయన వ్యూహాలు ఎంత వరకు సక్సెస్ అవుతాయో చూడాలి. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios