హుజూర్‌నగర్: హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో  ప్రచారానికి మంత్రి హరీష్ రావు వెళ్తారా అనేది ప్రస్తుతం చర్చ సాగుతోంది. హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఎన్నికల ప్రచార బాధ్యతలను మంత్రి కేటీఆర్ చూస్తున్నారు. ఈ నియోజకవర్గానికి మండలాల వారీగా పార్టీ ప్రజా ప్రతినిధులకు ఇంచార్జీ బాధ్యతలను కూడ టీఆర్ఎస్ నాయకత్వం అప్పగించింది.

హుజూర్‌నగర్  అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పార్టీ నేతల మధ్య సమన్వయం కోసం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి  సీఎం కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు. ఈ నియోజకవర్గంలోని ప్రతి మండలానికి ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు పార్టీకి చెందిన కీలక నేతలను ఇంచార్జీలుగా టీఆర్ఎస్ నాయకత్వం నియమించింది.

పోలింగ్‌కు రెండు రోజుల ముందు సీఎం కేసీఆర్ హుజూర్‌నగర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. అయితే హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల ప్రచారంలో  మంత్రి హరీష్ రావు పాల్గొంటారా అనే చర్చ సాగుతోంది.

టీఆర్‌ఎస్ లో  ట్రబుల్ షూటర్ గా  హరీష్ రావుకు పేరుంది. 2018 డిసెంబర్ 7వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల ఓటమిలో హరీష్ రావు కీలక పాత్ర పోషించారు. ఈ నియోజకవర్గాల్లో హరీష్ రావు ఆ సమయంలో ప్రత్యేక హెలికాప్టర్ లో వెళ్లి ప్రచారం నిర్వహించారు.

అయితే ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో  మాత్రం హరీష్ రావు ఉమ్మడి మెదక్ జిల్లాకే పరిమితమయ్యారు. హుజూర్‌నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్ రావు ప్రచారానికి వెళ్తారా అనే విషయమై స్పష్టత లేదు.

పార్టీ నేతల మధ్య సమన్వయం చేస్తూనే ప్రత్యర్ధులకు చెక్ పెట్టడంలో హరీష్ దిట్ట. అయితే హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానంలో  కాంగ్రెస్ కు మంచి పట్టుంది. అయితే ఈ పట్టును నిలుపుకొనేందుకు ఆ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. కాంగ్రెస్ ను ఓడించి  పాగా వేయాలని టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది.