హైదరాబాద్: మాజీ శాసనమండలి ఛైర్మెన్ స్వామి గౌడ్  చేసిన వ్యాఖ్యలు ఇటీవల కాలంలో తెలంగాణ రాజకీయాల్లో కలకం రేపుతున్నాయి. స్వామిగౌడ్ వ్యాఖ్యల వెనుక అంతరార్ధం ఏమిటనే విషయమై తెలంగాణ పొలిటికల్ వర్గాల్లో చర్చ సాగుతోంది.

తెలంగాణ రాష్ట్ర శాసనమండలికి తొలి ఛైర్మెన్ గా స్వామిగౌడ్ కొనసాగారు. స్వామి గౌడ్ పదవీ కాలం ముగిసింది. అయితే ఆయనకు ఎలాంటి పదవులు దక్కలేదు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగిన తెలంగాణ  ఉద్యమంలో  స్వామిగౌడ్ కీలకపాత్ర పోషించారు. ఆ సమయంలో ఆయన టీఎన్జీఓ చీఫ్ గా ఉన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 42 రోజుల పాటు సాగిన సకల జనుల సమ్మెలో స్వామిగౌడ్ కీలక పాత్ర పోషించారు.  ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన శాసనమండలి ఛైర్మెన్ గా స్వామి గౌడ్ కు కేసీఆర్ కట్టబెట్టారు.

రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానంనుండి పోటీ చేయాలని స్వామిగౌడ్ గతంలో టీఆర్ఎస్ నాయకత్వం వద్ద ప్రతిపాదించారు. 2009, 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన ప్రకాష్ గౌడ్ విజయం సాధించారు. 2014 తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రకాష్ గౌడ్ టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. 2018 లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగాప్రకాష్ గౌడ్ పోటీ చేసి విజయం సాధించారు.

ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం దక్కలేదు. ఎమ్మెల్సీగా పొడిగింపు అవకాశం స్వామి గౌడ్ కు దక్కలేదు. 2018 నుండి టీఆర్ఎస్ కార్యక్రమాలకు కూడ ఆయన దూరంగానే ఉన్నారు. ఇటీవల ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో స్వామిగౌడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని కులాల ఆధిపత్యం కొనసాగుతోందని ఆయన వ్యాఖ్యలు చేశారు.  ఆ తర్వాత బోయిన్ పల్లిలో సర్దార్ సర్వాయి పాపప్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కూడ స్వామిగౌడ్ చేసిన వ్యాఖ్యలు సంచలనానికి కారణమయ్యాయి.

మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిని స్వామిగౌడ్ ప్రశంసలతో ముంచెత్తారు. రెడ్డి సామాజిక వర్గంలో పుట్టినా కూడ... బీసీలకు రేవంత్ రెడ్డి అండదండగా నిలిచాడని ఆయన చెప్పారు. ఇదే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి కూడ మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్వామిగౌడ్ లను ప్రశంసించారు.తెలంగాణ ఉద్యమంలో స్వామిగౌడ్, శ్రీనివాస్ గౌడ్ ల పాత్రను ఎవరూ కూడ మరువలేరన్నారు. 

2019లో జరిగినన పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడ చేవేళ్ల ఎంపీ స్థానం నుండి స్వామిగౌడ్  పేరు కూడ విన్పించింది. అయితే ఈ స్థానంలో డాక్టర్ రంజిత్ రెడ్డిని టీఆర్ఎస్ బరిలోకి దింపింది. కార్పోరేషన్ పదవి కూడ స్వామిగౌడ్ కు దక్కలేదు.తనను పక్కన పెట్టారనే ఉద్దేశ్యంతోనే స్వామిగౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారా... మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయమై టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ సాగుతోంది.అయితే ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డిని ప్రశంసించడం కూడ చర్చనీయాంశంగా మారింది.

స్వామిగౌడ్ వ్యాఖ్యల వెనుక అసంతృప్తి కన్పిస్తోందోననే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి. స్వామిగౌడ్ చేసిన వ్యాఖ్యల విషయంలో టీఆర్ఎస్ స్పందించలేదు. త్వరలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ నేతల మధ్య తీవ్రమైన పోటీ ఉంది.

గత టర్మ్ లో ఎక్సైజ్ మంత్రిగా ఉన్న పద్మారావుగౌడ్ కు ఈ దఫా డిప్యూటీ స్పీకర్ పదవిని కట్టబెట్టారు సీఎం కేసీఆర్. స్వామిగౌడ్ చేసిన వ్యాఖ్యల తర్వాత డిప్యూటీ స్పీకర్ పద్మారావుతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకొంది.