నిజామాబాద్: మాజీ  పీసీసీ నేత, టీఆర్ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్ టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరుకావడం ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.  పార్టీ కార్యక్రమాలకు చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు.

 తనపై చర్యలు తీసుకోవాలని కూడ డిమాండ్ చేశారు. కానీ, ఆయనపై పార్టీ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికిప్పుడే డిఎస్ ఏ పార్టీలోనూ చేరే అవకాశం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పార్లమెంటరీ పార్టీ సమావేశానికి డిఎస్ వ్యూహాత్మకంగానే హాజరయ్యారా అనే చర్చ కూడ లేకపోలేదు.


గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు డిఎస్‌పై నాలుగు పేజీల ఫిర్యాదుతో లేఖను కేసీఆర్‌కు పంపారు. ఈ లేఖపై డిఎస్ మండిపడ్డారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని  ఆయన  మండిపడ్డారు.

ఆ తర్వాత డిఎస్ తనయుడు సంజయ్‌పై ఓ కేసులో  పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయమై కూడ తమ కుటుంబాన్ని ఇబ్బందిపెట్టారని కూడ డిఎస్ ఆరోపణలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో  తన అనుచరులుగా ఉన్న నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

దీని వెనుక డిఎస్ ఉన్నాడని కూడ ఆ సమయంలో టీఆర్ఎస్ నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ సమయంలోనే డిఎస్ కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం కూడ సాగింది. కానీ, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరలేదు.

అసెంబ్లీ ఎన్నికల్లో డిఎస్ అనుచరులు పోటీ చేసినా కూడ విజయం సాధించలేదు. ఆ తర్వాత  పార్లమెంట్ ఎన్నికల సమయంలో  డిఎస్ తనయుడు ధర్మపురి అరవింద్ బీజేపీ అభ్యర్ధిగా నిజామాబాద్ నుండి పోటీ చేసి విజయం సాధించారు.  నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ కవితపై అరవింద్ విజయం సాధించారు.

అరవింద్ విజయంలో  డిఎస్ కీలకంగా వ్యవహరించారనే ప్రచారం ఉంది. ఈ ఎన్నికల సమయంలో  తన పాత పరిచయాలను డిఎస్ వినియోగించుకొని కొడుకు విజయం కోసం పనిచేశారనే ప్రచారం కూడ సాగింది.

ఈ ఎన్నికల్లో  బీజేపీ గెలుపు కోసం  పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ కూడ సహకరించిందని టీఆర్ఎస్ నాయకత్వానికి ఆ జిల్లా నుండి నివేదికలు అందాయి. పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు టీఆర్ఎస్‌కు తీవ్ర నిరాశను మిగిల్చాయి.  ఏడు స్థానాలను టీఆర్ఎస్ కోల్పోయింది. ఇందులో  కీలకమైన  నిజామాబాద్, కరీంనగర్ స్థానాలు కూడ ఉన్నాయి.

పార్లమెంట్ ఎన్నికల సమయం నుండి డిఎస్ బీజేపీతొ కొంత సన్నిహితంగా ఉంటున్నట్టుగా ప్రచారం సాగింది. కానీ, ఆయన ఆ పార్టీలో చేరలేదు. టీఆర్ఎస్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన తర్వాత కూడ ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు.

కేసీఆర్ నిర్వహించిన పార్లమెంటరీ  పార్టీ  సమావేశాలకు కూడ ఆయన దూరంగానే ఉంటున్నారు. కానీ, ఇవాళ ఢిల్లీలో జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి డిఎస్ హాజరుకావడం మాత్రం రాజకీయ వర్గాల్లో  ఆసక్తిని కల్గిస్తోంది.

ఇప్పటికిప్పుడే డిఎస్ ఏ రాజకీయ పార్టీలో చేరే అవకాశాలు లేవని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తనతో పాటు తన కుటుంబాన్ని ఇబ్బందుల్లో పెట్టినందుకు కవిత ఓటమి ద్వారా  డిఎస్ ప్రతీకారం తీర్చుకొన్నారని ఆయన వర్గీయులు సంబరాల్లో ఉన్నారు. 

 కవిత ఓటమికి అనేక కారణాలు కారణంగా  కూడ టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. స్థానిక టీఆర్ఎస్ నాయకత్వం కూడ ఈ ఎన్నికల్లో అతి విశ్వాసంతో వ్యవహరించిందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

గత ఏడాది కూడ డిఎస్ ఢిల్లీలో పార్టీ పార్లమెంటరీ సమావేశంలో పాల్గొన్నారు.కానీ, హైద్రాబాద్ లో జరిగిన  సమావేశానికి దూరంగా ఉన్నారు. ఇదిలా ఉంటే నిజామాబాద్‌లో కవిత ఓటమి పాలు కావడం టీఆర్ఎస్ నాయకత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. 

 ఈ తరుణంలో తమకు దూరమైన నేతలను తిరిగి దగ్గరకు చేర్చుకొనే క్రమంలో డిఎస్‌ను ఈ సమావేశానికి ఆహ్వానించారా అనే కోణంలో కూడ చర్చ లేకపోలేదు. అయితే ఈ విషయమై టీఆర్ఎస్ నుండి స్పష్టత రావాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

షాకింగ్‌: టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌కు డీఎస్