న్యూఢిల్లీ: టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ఆ పార్టీ ఎంపీ డిఎస్ బుధవారం నాడు హాజరయ్యారు. కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడని డిఎస్‌పై ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నేతలు ఆయనపై కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుపై వివరణ ఇచ్చేందుకు ఆయన కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. కానీ, కేసీఆర్ మాత్రం ఆయనకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో  డిఎస్ తనయుడు అరవింద్ బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్ధి కవితపై  విజయం సాధించారు.

అరవింద్  గెలుపు వెనుక డిఎస్ కూడ కీలకంగా వ్యవహరించారనే ప్రచారం ఉంది.పార్లమెంట్ ఎన్నికల ముందు డీఎస్ టీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు.ఇవాళ న్యూఢిల్లీలో జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి డిఎస్ హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది.