హైదరాబాద్:ఆర్టీసీ సమ్మెను రాజకీయంగా  తమకు అనుకూలంగా వినియోగించుకోవాలని బీజేపీ  ప్లాన్ చేస్తోంది. ఈ విషయంలో కేసీఆర్ ను ఇరుకునపెట్టేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం అడుగులు వేస్తోంది. ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా వినియోగించుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది.

ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్ తో పాటు 26 డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు జేఎసీగా ఏర్పడి ఈ నెల 5వ తేదీ నుండి సమ్మెకు దిగారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోయారని సీఎం కేసీఆర్ ప్రకటించారు. తాము విధించిన డెడ్‌లైన్  లోపుగా విధుల్లో చేరనందున ఆటోమెటిక్ గా ఉద్యోగాలను కోల్పోతారని సీఎం కేసీఆర్ కుండబద్దలు కొట్టారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై ఆర్టీసీ కార్మికులు ఇతర రాజకీయ పార్టీల మద్దతును కూడగడుతున్నాయి. విపక్షాలు కూడ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా నిలిచాయి. ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామని పార్టీలు ప్రకటించాయి.

ఆర్టీసీ సమ్మెను పురస్కరించుకొని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అద్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ రాష్ట్ర గవర్నర్ ను తమిళిసై సౌందర రాజన్ ను కలిశారు. ఆర్టీసీ సమ్మె పరిష్కారం విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు.

ఆర్టీసీలో రాష్ట్ర ప్రభుత్వ వాటాతో పాటు కేంద్ర ప్రభుత్వ వాటా కూడ ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ వాటాతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వ వాటా నామ మాత్రమే. అయితే  కేంద్ర ప్రభుత్వ వాటా కూడ ఆర్టీసీలో ఉన్నందున ఈ విషయమై కేంద్రం నుండి నరుక్కొంటూ రావాలని కమలదళం భావిస్తోంది.

తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‌ను బీజేపీ రాష్ట్ర నేతలు కలిసి ఫిర్యాదు చేయడం వెనుక రాజకీయమైన వ్యూహమే ఉందని రాజకీయ  విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ విషయమై కేంద్రానికి తమిళనాడు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్  నివేదిక అందిస్తే  కేంద్రం జోక్యం చేసుకొనే అవకాశం ఉంటుందా అనే చర్చ కూడ లేకపోలేదు. ఒకవేళ అదే జరిగితే కేసీఆర్‌ ను రాజకీయంగా  ఇరుకున పెట్టేందుకు ప్రయత్నం చేసే అవకాశం లేకపోలేదని  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆర్టీసీలో తమ వాటా కూడ ఉందని కేంద్రం కూడ ఈ విషయంలో వేలు పెడితే కేసీఆర్ ఏ రకంగా వ్యవహరిస్తారనే చర్చ కూడ లేకపోలేదు. అయితే ఈ విషయమై కేంద్రం జోక్యం చేసుకొనే పరిస్థితి ఉంటుందా అని  ప్రశ్నించే వాళ్లు కూడ లేకపోలేదు.