హైదరాబాద్: రిటైర్డ్ ఉద్యోగులకు పూర్తి స్థాయి పెన్షన్ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని ఏజీని కోరింది తెలంగాణ హైకోర్టు.

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో రిటైర్డ్ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్ ను  సగం మాత్రమే చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.ఈ విషయాన్ని గతంలోనే సీఎం కేసీఆర్ ప్రకటించారు.

లక్ష్మయ్య అనే రిటైర్డ్ ఉద్యోగి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు సగం పెన్షన్ ఇవ్వడంపై దాఖలైన పిటిషన్ ను  హైకోర్టు శుక్రవారం నాడు వీడియో కాన్పరెన్స్ ద్వారా విచారించింది.ఏ ప్రాతిపదికన పెన్షన్లలో కోత విధించారో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో కోత విధించడం సరైంది కాదని హైకోర్టు అభిప్రాయపడింది.

also read:కరోనా దెబ్బ: మర్కజ్, దియో బంద్ సెకండరీ కాంటాక్ట్ లిస్టు సేకరణలో తెలంగాణ పోలీస్

లాక్‌డౌన్ సమయంలో పెన్షనర్లకు అనారోగ్య  సమస్యలు వస్తే ఎవరు ఆదుకొంటారని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు.రిటైర్డ్ ఉద్యోగులకు పూర్తి స్థాయి పెన్షన్ ఇచ్చేలా సర్కార్ ను ఒప్పించాలని ఏజీని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు.తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సేవ చేస్తున్న వైద్యులు, పారిశుద్య సిబ్బంది, పోలీస్  సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి వేతనాలను అందించింది.  పెన్షనర్లతో పాటు అన్ని రంగాల ఉద్యోగులకు ఆయా స్థాయిల్లో వేతనాల్లో కోత విధించింది.

దీంతో రిటైర్ట్ ఉద్యోగుల పెన్షన్లను పూర్తి స్థాయిలో చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని దాఖలైన పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.