Asianet News TeluguAsianet News Telugu

నూతన సచివాలయంలో సీఎం కేసీఆర్ తొలి సంతకం ఏ ఫైల్ పైనా?

తెలంగాణ ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి సిద్దమైంది. ఇందుకు సంబంధించి కార్యక్రమాల షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే.. ఈ నూతన సచివాలయంలో సీఎం కేసీఆర్‌ ఏ ఫైల్‌పై  తొలి సంతకం చేయబోతున్నారనే అంశం ఇప్పుడు చర్చనీయంగా మారింది. 

What is the CM KCRs first signature in the new secretariat KRJ
Author
First Published Apr 27, 2023, 7:44 AM IST

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి సిద్దమైంది. ఈ నెల 30న బీఆర్‌ అంబేడ్కర్‌ నూతన సెక్రటేరియట్‌ను సీఎం కేసీఆర్  ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి కార్యక్రమాల షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే.. ఈ నూతన సచివాలయంలో సీఎం కేసీఆర్‌ ఏ ఫైల్‌పై  తొలి సంతకం  చేయబోతున్నారనే అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంగా మారింది. 

ఓ వైపు ..  దళితబంధు రెండో విడత అమలు మార్గదర్శకాల ఫైలుపై సంతకం చేస్తారనే ప్రచారం సాగుతుంటే.. మరోవైపు.. సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సాయానికి సంబంధించిన మార్గదర్శకాలపై గానీ, పోడు హక్కు పట్టాల పంపిణీ ఫైళ్లలో సంతకం పెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. నూతన సచివాలయానికి అన్ని ప్రభుత్వ శాఖలు, అధికారులు మారుతున్న వేళలో 30న మధ్యాహ్నం 1.58 నుంచి 2.04 గంటల మధ్య అధికారులు ఒక ఫైలుపై సంతకం చేయాలంటూ సీఎస్‌ శాంతికుమారి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. దీంతో అధికారులతో పాటు సీఎం కేసీఆర్ ఏ ఫైలుపై తొలి సంతకం చేయబోతున్నారనే ఆసక్తి పెరుగుతోంది. 

గతంలో సీఎం మాట్లాడుతూ.. ‘మా దగ్గర చాలా సంక్షేమ పథకాలున్నయ్‌.. వాటిని ప్రకటిస్తే ప్రతిపక్షాల పని ఖతం’’అని అన్నారు. ఇటీవల జరిగిన బీఆర్‌ఎస్‌ సభల్లో మంత్రి కేటీఆర్‌  కూడా ఇదే తరహా వ్యాఖ్యలను చేశారు. దీంతో తొలి సంతకం ఏదైనా నూతన సంక్షేమ పథకం ప్రకటన చేయనున్నారనే మరో ప్రచారం కూడా సాగుతోంది. ఇవికాకుండా.. ఇంకా ఏమైనా ప్రాధాన్యం కలిగిన అంశాలేమైనా ఉన్నాయా? అనే చర్చలు కూడా జరుగుతున్నాయి.  

ఇదిలా ఉంటే.. ప్రారంభోత్సవానికి సంబంధించి కార్యక్రమాల షెడ్యూల్‌ను విడుదలను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. తొలుత ఉదయం 6 గంటలకు సుదర్శన యాగం నిర్వహించనున్నారు. ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్ యాగంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 1.20 నుంచి 1.30 గంటల మధ్య పూర్ణాహుతి కార్యక్రమం చేయనున్నారు. ఆ తర్వాత నూతన సచివాలయాల ప్రారంభోత్సవం సీఎం కేసీఆర్ చేతులపై జరుగనున్నది. ఆ తరువాత నేరుగా 6వ అంతస్తులో వున్న తన ఛాంబర్‌లో సీఎం కేసీఆర్ అడుగుపెట్టనున్నారు. మధ్యాహ్నం 1.58 నుంచి 2.04 గంటల మధ్య అధికారులు తమతమ చాంబర్లలో అడుగుపెడుతారు. ఈ సమయంలోనే ఒక ఫైల్ మీద సంతకం చేయాలని సాధారణ పరిపాలన శాఖ నుంచి మంత్రులు, అధికారులకు ఆదేశాలు వచ్చాయట. అనంతరం 2.15 నిమిషాలకు సీఎం కేసీఆర్ ప్రసంగం ఉండనున్నది. 

ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న  ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, అన్ని శాఖల హెచ్ వోడీలు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, జిల్లా గ్రంథాలయ చైర్మన్లు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు, మున్సిపల్ మేయర్లు తదితరులు  పాల్గొంటార‌ని స‌మాచారం. ఈ కార్యక్రమానికి సుమారు 2500 మంది హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో కొత్త సచివాలయంలో పలు భద్రతా చర్యలు చేపట్టారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios