ఏమిటీ ఓటుకు నోటు కేసు?: చార్జిషీట్ లో 22 సార్లు చంద్రబాబు పేరు

What is cash for vote allegedly involved Chandrababu
Highlights

ఓటుకు నోటు కేసు తిరిగి తెరపైకి వచ్చింది. మూడేళ్ల నాటి కేసు చాలా కాలంగా కదలిక లేదు.

హైదరాబాద్: ఓటుకు నోటు కేసు తిరిగి తెరపైకి వచ్చింది. మూడేళ్ల నాటి కేసు చాలా కాలంగా కదలిక లేదు. శాసన మండలి ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను ప్రలోభ పెట్టే ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) పట్టుబడ్డారు. అప్పుడు తెలుగుదేశంలో ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెసు పార్టీలో చేరారు. 

సోమవారం ప్రగతిభవన్ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఓటుకు నోటు కేసుపై సమీక్ష జరపడంతో మళ్లీ కదలిక ప్రారంభమైనట్లు భావిస్తున్నారు. కేసు విషయంలో కేసిఆర్ కచ్చితమైన ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. 

చట్టం ముందు అందరూ సమానులేనని, చట్టప్రకారం వ్యవహరించాలని, అధికారులపై ఏ విధమైన ఒత్తిళ్లు ఉండవని కేసిఆర్ హామీ ఇచ్చినట్లు చెప్పారు. దాదాపు రెండు గంటల పాటు ఆయన పోలీసు, న్యాయశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కేసు మరోసారి తెరపైకి రావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపింది.

నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ స్టన్ కు రూ.50 లక్షలు లంచం ఇస్తూ రేవంత్ రెడ్డి ఎసిబికి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి కొంత కాలం జైలులో కూడా ఉన్నారు. స్టీఫెన్ సన్ కు రూ.50 లక్షలు ఇవ్వజూపడానికి ముందు చంద్రబాబు ఆయనకు ఫోన్ చేసి టీడిపి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని అడిగినట్లు బయటపడిన వీడియో అప్పట్లో సంచలనం సృష్టించింది. 

ఈ కేసులో ఎసిబి ఇప్పటి వరకు రెండు చార్జిషీట్లను దాఖలు చేసింది. మొదటి చార్జిషీట్ లో రేవంత్ రెడ్డిని ఎసిబి మొదటి ముద్దాయిగా పేర్కొంది. ఈ చార్జిషీట్ లో చంద్రబాబు పేర 22 సార్లు ప్రస్తావనకు వచ్ిచంది. 

స్టీఫెన్ సన్ తో చంద్రబాబు మాట్లాడిన ఆడియో రికార్డులో ఆ గొంతు చంద్రబాబుదా కాదా అని నిర్ధారించందుకు ఎసిబి చర్యలు చేపట్టింది. ఆడియో టేపులను చండీగఢ్ ఫోరెన్సిక్ విభాగానికి పంపించింది. అది చంద్రబాబు గొంతేనని ఫోరెన్సిక్ విభాగం నివేదిక ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ నివేదికను బయటపెట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బిజెపి నాయకుడు ఆంజనేయ రెడ్డి డిమాండ్ చేశారు 

కారణం తెలియదు గానీ ఈ కేసు గత రెండున్నరేళ్లుగా ముందుకు కదలలేదు. చంద్రబాబు కేంద్రంతో లాలూచీ పడడం వల్లనే ఓటుకు నోటు కేసు పక్కకు వెళ్లిందని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పదే పదే విమర్శిస్తున్నారు. అందుకే చంద్రబాబు ప్రత్యేక హోదాను వదిలేశారని కూడా అంటూ వస్తున్నారు. ఇందులో ఎంత వరకు నిజం ఉందనేది తెలియదు. 

చంద్రబాబు గొంతును ధ్రువీకరించుకునేందుకు వాయిస్ శాంపిల్ పరీక్షను హైదరాబాదులోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో కాకుండా చండీగడ్ ఫోరెన్సిక్ ల్యాబ్ చేయించింది. దానికి ముందే వైఎస్సార్  కాంగ్రెసు శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణా రెడ్డి తాను చంద్రబాబు ఆడియో శాంచిపులను పరీక్ష చేయించినట్లు చెబుకున్నారు. దాన్ని ముందు పెట్టి చంద్రబాబుపై విచారణ జరపాలని కోరుతూ హైకోర్టులోనూ సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేశారు. 

ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో ఫోన్ లో మాట్లాడుతూ చంద్రబాబు మనవాళ్లు బ్రీఫ్ డ్ మీ అని అన్నట్లు ప్రచారం జరిగింది. ఈ కేసులో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఎ1గా ఉండగా, సెబాస్టియన్ ఏ2గా, టిడీపి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఏ3గా, ఉదయ్ సింహ ఏ4గా, జెరూసెలం మత్తయ్య ఎ5గా ఉన్నారు. 

రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, సండర్, ఉదయ్ సింహలను విచారించిన ఎసిబీ అధికారులు 2015 జులై 28వ తేీదన మొదటి చార్జిషీట్ దాఖలు చేశారు. ఆ తర్వాత కేసు దర్యాప్తులో భాగంగా ఆడియో, వీడియో శాంపిల్స్, స్టీఫెన్ సన్, సెబాస్టియన్, రేవంత్, తదితరుల ఫోరెన్సిక్ నివేదికలను 2017 మార్చిలో దాఖలు చేసిన అనుబంధ చార్జిషీటులో పొందు పరిచారు. 

త్వరలో తుది చార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. వచ్చే పదిహేను రోజుల్లో ఎసిబి పూర్తి స్థాయి చార్జిషీట్ దాఖలు చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. దాంతో చంద్రబాబు చిక్కుల్లో పడుతారని అంటున్నారు.

loader