వాదాల్లో చిక్కుకుంటున్న మంత్రి పోచారం పొంతన లేని మాటలతో వార్తల్లోకి పోచారం ఎవరూ చెప్పే వరకు ఆగనంటూ కామెంట్ గతంలో మంత్రులు ఫామ్ హౌస్ కే పరిమితమట
తెలంగాణ మంత్రివర్గంలో సీనియర్ గా ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒక్కసారిగా వివాదాస్పద కామెంట్లు చేసి చర్చనీయాంశమయ్యారు. బుధవారం ఆయన నిజామాబాద్ జిల్లాలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొట్టు మాటలు మాట్లాడి వార్తల్లోకి ఎక్కారు పోచారం. ఆయన రెండు కీలకమైన వివాదాస్పద ప్రకటనలు చేశారు. వాటిని ఒకసారి పరిశీలిద్దాం.
1 నాకు ఓపిక లేకపోతే, పనిచేయలేని ఆరోగ్య పరిస్థితులు వస్తే స్వచ్చందంగా రాజకీయాల నుండి తప్పుకుంటా. అంతే తప్ప మరోకరితో చెప్పించుకునే అవకాశం ఇవ్వను.
2 గతంలో వ్యవసాయ రంగానికి 5 గురు మంత్రులుండేవారు. అనుభవం లేని ఆ మంత్రులు కేవలం ఫాంహౌస్ లోనే గడిపేవారు. గతంలో వ్యవసాయ శాఖ మంత్రుల కార్యాలయాలలో విత్తన, యంత్రాల పరికరాల కంపెనీల ప్రతినిధులు పెత్తనం చెలాయించేవారు.
ఈ రెండు కామెంట్లు చేసిన తర్వాత పోచారం ఎందుకు అంతగా కామెంట్లు చేశారన్న చర్చ ఇటు టిఆర్ఎస్ శ్రేణుల్లో జోరుగా సాగుతుండగా బయటి పార్టీల్లో కూడా సీరియస్ గానే చర్చ నడుస్తోంది. తీవ్రమైన కామెంట్లు చేయడం వెనుక కారణాలేముంటాయన్న అన్వేషనలో పడ్డాయి గులాబీ శ్రేణులు. పోచారం తెలంగాణ రాకముందే టిడిపికి రాజీనామా చేసి టిఆర్ఎస్ లో చేరారు. ఉప ఎన్నికల్లో పోటీచేసి నెగ్గారు. తెలంగాణ రాగానే మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారు కేసిఆర్.
మరి ఆయనను రాజకీయాల నుంచి తప్పుకోవాలని అన్నదెవరు? తాను ఎవరితోనూ చెప్పించుకునే స్థితిలో లేనని ఎందుకన్నారు అనేది తేలాల్సి ఉంది. ప్రతిపక్ష పార్టీలు కూడా ఆయనను తప్పుకోవాలని కోరిన దాఖలాలు లేవు. అయినా ఈమధ్య కాలంలో వివాదాల్లో కూడా పోచారం లేరు కదా అని అంటున్నారు గులాబీ నేతలు.
ఇక గతంలో పనిచేసిన వ్యవసాయశాఖ మంత్రులు ఫామ్ హౌస్ లకే పరిమితమయ్యారు అన్న కామెంట్ ఎందుకు చేశారో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. నిజానికి తెలంగాణ రాకముందు గత పదేళ్ల కాలంలో వ్యవసాయ శాఖకు రఘువీరారారెడ్డి మంత్రిగా ఉన్నారు. ఆయన ఏనాడూ ఫామ్ హౌస్ లో మకాం పెట్టిన దాఖలాలు లేవు. అంతకుముందు టిడిపి పాలనా కాలంలో ఉన్న మంత్రులు సైతం ఫామ్ హౌస్ లలో మకాం పెట్టిన దాఖలాలు లేవు.
ఆ మాటకొస్తే తెలంగాణ సిఎం కేసిఆర్ తరచుగా ఫామ్ హౌస్ కు వెళ్తుంటారు. కేసిఆర్ సిఎం కాకముందు, సిఎం అయిన తర్వాత కూడా ఫామ్ హౌస్ లో రోజుల తరబడి ఆయన గడుపుతుంటారు. అక్కడ జరిగే వ్యవసాయ పనులు పర్యవేక్షిస్తుంటారు.
ఒక దశలో కేసిఆర్ పై విమర్శలు కూడా గుప్పుమన్న పరిస్థితి ఉంది. ఫామ్ హౌస్ అనగానే కేసిఆర్ పేరు గుర్తొచ్చేలా ప్రతిపక్ష పార్టీలు అంతగా విమర్శలు చేశారు. నిన్నమొన్న బిజెపి నేత ఇంద్రసేనారెడ్డి అయితే సచివాలయానికి రాకుండా పాలన చేసే సిఎం అంటూ ఘాటుగా కామెంట్ చేశారు. ఫామ్ హౌస్ కే పరిమితమైన సిఎం అన్నారు. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు ఫామ్ హౌస్ అనే పదం ఉచ్చరించడానికి భయపడే పరిస్థితి ఉంది. మరి ఈనేపథ్యంలో పోచారం గతంలో వ్యవసాయ మంత్రులంతా ఫామ్ హౌస్ లోనే గడిపారని ఎందుకున్నారో అంతుచిక్కడంలేదని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.
