తెలంగాణకు రెండు సార్లు సీఎంగా ఎన్నికైన కేసీఆర్ ను కించపరిచే విధంగా మాట్లాడిన ఎంపీ బండి సంజయ్ పై ఏం చర్యలు తీసుకుంటారని లోక్ సభ స్పీకర్ ను మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై తాము ఎలాంటి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ మేరకు నేటి ఉదయం ఆయన ట్వీట్ చేశారు.

తెలంగాణ ప్రజా నాయకుడు, రెండు సార్లు సీఎంగా ఎన్నికైన కేసీఆర్ పై లోక్ సభలో బండి సంజయ్ నీచమైన భాషలో మాట్లాడారని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఇప్పుడు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని స్పీకర్ ఓం బిర్లాను ఆయన ప్రశ్నించారు. ప్రధాని ఇంటి పేరును కించపరిచే విధంగా మాట్లాడినందుకు ఓ ఎంపీని లోక్ సభ నుంచి సస్పెండ్ చేశారని పరోక్షంగా రాహుల్ గాంధీ అనర్హతను గుర్తు చేశారు. 

ఈ మేరకు మంత్రి కేటీఆర్ శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. ‘‘ ప్రధాని ఇంటిపేరును కించపరిచే విధంగా పిలిచినందుకు కాంగ్రెస్ కు చెందిన ఓ ఎంపీని ఆయన సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించారు. ఇప్పుడు తెలంగాణకు చెందిన ఓ బీజేపీ ఎంపీ నిన్న లోక్ సభలో తెలంగాణకు చెందిన రెండుసార్లు ఎన్నికైన పాపులర్ సీఎం కేసీఆర్ ను నీచమైన భాషలో దూషించారు. స్పీకర్ సర్ ఇప్పుడు మీరు/మేము ఏమి చేయాలి? ’’ అని బండి సంజయ్ ను ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు. ఈ ట్వీట్ కు లోక్ సభ స్వీకర్ ఓం బిర్లాను ట్యాగ్ చేశారు. 

లోక్ సభలో గురువారం బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ పై, బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అవినీతి యూపీఏ ఎలా ఇండియాగా మారిందో అదే అవినీతి టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిందన్నారు. కేసీఆర్ పేరును ఖాసీం చంద్రశేఖర్ రజ్వీ అని బండి సంజయ్ సంబోధించారు. కేసీఆర్ సర్కార్ విధానాలతో తెలంగాణలో రైతులు నాశనమౌతున్నారన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరు చెప్పి ప్రజలను కేసీఆర్ సర్కార్ మోసం చేస్తుందని ఆయన విమర్శించారు.

మోడీ మణిపూర్ వెళ్లలేదని బీఆర్ఎస్ విమర్శలు చేయడాన్ని బండి సంజయ్ ప్రస్తావిస్తూ తెలంగాణలో ఇంటర్ విద్యార్థులు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కేసీఆర్ వెళ్లారా అని ప్రశ్నించారు. తెలంగాణలో విద్యుత్ కు 24 గంటల పాటు విద్యుత్ ఇవ్వకపోతే కేసీఆర్ సర్కార్ రాజీనామా చేస్తుందా అని ఆయన అన్నారు. తెలంగాణ సీఎం కుటుంబ సభ్యుల ఆస్తులు విపరీతంగా పెరిగాయని ఆరోపించారు. తెలంగాణ సీఎం కుమారుడు ఆస్తులు 400 రేట్లు పెరిగాయని బండి సంజయ్ అన్నారు.