Weather alert: ఉపరితల ద్రోణి ప్రభావంతో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముంద‌ని భార‌త వాతావ‌ర‌ణ విభాగం పేర్కొంది. ఈ  నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ‌, ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

IMD issued yellow alert for two Telugu states: మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముంద‌ని భార‌త వాతావ‌ర‌ణ విభాగం పేర్కొంది. మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌ని తెలిపింది. ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ‌, ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

వివ‌రాల్లోకెళ్తే.. ఉపరితల ద్రోణి, అల్పపీడన ప్రభావంతో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో ఏపీతో పాటు యానాంపై అల్పపీడన ప్ర‌భావం కొనసాగుతుండటంతో నేడు, రేపు (సోమ, మంగళవారాలు) ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ‌ వాతావ‌ర‌ణ విభాగం తెలిపింది. 

తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ స‌మ‌యంలో ప‌లు చోట్ల వ‌డ‌గండ్ల వ‌ర్షం కురిసే అవ‌కాశాలను సైతం ప్ర‌స్తావించింది. మరోవైపు తెలంగాణలోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వరంగల్, నల్లగొండ ఉమ్మడి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కురిసిన అకాల వర్షాలకు భారీగా పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే.

ఆకాల వ‌ర్షాల‌తో రైతుల‌పై దెబ్బ‌.. ఆదుకుంటామ‌న్న ప్ర‌భుత్వం..

ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందిస్తామని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు. ఆయ‌న శనివారం నాడు కరీంనగర్ రూరల్ మండలం దుర్షాద్, చేగుర్తి, ఎరుకుల్ల, చామన్పల్లిలో వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి మొక్కజొన్న, వరి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. దుర్షాద్, చేగుర్తి, ఎరుకుల, చామన్పల్లిలో సుమారు 450 ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయనీ, 200 మంది రైతులు నష్టపోయారన్నారు.

270 ఎకరాల్లో మొక్కజొన్న, వరి పంట దెబ్బతినగా, 141 ఎకరాల్లో మామిడి పంట దెబ్బతింది. అధికారులు క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించి పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన తర్వాత పరిహారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. తమకు పరిహారం అందలేదని ఏ రైతు ఫిర్యాదు చేయొద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు.